శ్రద్ధా ఎముకల్ని గ్రైండర్లో వేసి పిండి చేశాడు

ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్యకేసులో ప్రతి విషయం సంచలనమే. ప్రియురాలు శ్రద్ధా వాకర్ ని హత్య చేసిన ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా కోసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు…

ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్యకేసులో ప్రతి విషయం సంచలనమే. ప్రియురాలు శ్రద్ధా వాకర్ ని హత్య చేసిన ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా కోసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు అనేది ఇప్పటికే తెలిసిన విషయం. ఆ తర్వాత పోలీసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి, ఆ చార్జ్ షీట్ లో పొందుపరిచిన మరిన్ని విషయాలు సామాన్యులను మరింత విస్తుపోయేలా చేస్తున్నాయి.

అసలు ఒక మనిషి ఇంత క్రూరంగా ఆలోచిస్తాడా..? అప్పటి వరకూ అంత ప్రేమగా చూసుకున్న ప్రియురాలిని ఇంత క్రూరంగా చంపేస్తాడా..? చంపిన తర్వాత ఇంత క్రూరంగా ప్రవర్తిస్తాడా..? అని ఆశ్చర్యపోవాల్సిన విషయాలివి.

ఎముకల కోసం గ్రైండర్..

శ్రద్ధా వాకర్ ని చంపిన తర్వాత ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో శవాన్ని చుట్టేసి బయట పడేద్దామనుకున్నాడు ఆఫ్తాబ్. అలా చేస్తే వెంటనే దొరికిపోతామని అర్థమైంది. అందుకే మూడు కత్తులు, ఒక సుత్తి, ఇనుప వస్తువుల్ని విరగ్గొట్టే బ్లో టార్చ్ ని కొన్నాడు. చేతులు, కాళ్ల వేళ్లను విడగొట్టేందుకు బ్లో టార్చ్ వాడాడు. కత్తులతో శరీరాన్ని 35 ముక్కలుగా కోశాడు. చివరకు పెద్ద పెద్ద ఎముకలు మిగిలిపోయాయి. వాటిని మార్బుల్ కట్టర్ తో కట్ చేశాడు. గ్రైండర్ లో వేసి పిండి పిండి చేశాడు. ఆ పొడి ఉన్న పొట్లాలను పారేశాడు.

ఆమె వచ్చినప్పుడు మాత్రం..

శ్రద్ధా వాకర్ ని హత్య చేసిన తర్వాత ఆమె శవం ఇంట్లో ఉండగానే అతడు జొమాటో నుంచి తెప్పించిన చికెన్ రోల్స్ తిన్నాడని పోలీసులు చార్జ్ షీట్ లో వివరాలు నమోదు చేశారు. ఆ తర్వాత కొన్నిరోజుల పాటు మరో ప్రియురాలిని కూడా రూమ్ కి పిలిపించుకునేవాడు.

ఆమె వచ్చినప్పుడు మాత్రం శ్రద్ధా వాకర్ శరీర భాగాలున్న మూటను ఫ్రిడ్జ్ నుంచి తీసి కిచెన్ లో దాచేసేవాడు. ఆమె వెళ్లిపోగానే తిరిగి ఫ్రిడ్జ్ లో తెచ్చి భద్రపరిచేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా అంతా పూర్తి చేశాడు. నెలల తరబడి ఆ విషయాన్ని మేనేజ్ చేశాడు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కాడు. వివరాలన్నీ వెళ్లగక్కాడు.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన 6600 పేజీల ఛార్జ్ షీట్ లో ఇలాంటి విస్తుగొలిపే అంశాలు మరిన్ని ఉన్నాయి. అతడు విసిరేసిన శరీర భాగాల్లో చివరిది శ్రద్ధా వాకర్ తల అని, దాన్ని ఇంకా గుర్తించలేదని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.