జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అబిప్రాయాన్ని కొంత మార్పుకున్నట్లుగా ఉంది. ఆయన దిశ హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించారు.
దిశ ఘటన ప్రస్తుత చట్టాలు సరిపోవని తెలియచేస్తోందని ఆయన అన్నారు. ఆ ఘటన జరిగిన రాత్రి నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకాన్ని చూసిందో తలచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో రక్తం మరిగిపోతోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అందువల్లే తక్షణన్యాయం జరగాలని ప్రజలు కోరుకున్నారని ఆయన అన్నారు.
అయితే ఈ ఎన్ కౌంటర్ తో ఇలాంటి ఘటనలు ముగిసిపోతాయని అనుకోవద్దని ఆయన అన్నారు. దేశంలో మరే ఆడబిడ్డకూ ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆయన అన్నారు. ఇలాంటి కేసుల్లో కోర్టులపరంగా తక్షణ న్యాయం లభించాలని కోరారు. రెండు, మూడు వారాల్లోనే దోషులకు శిక్షలు పడేలా నిబంధనలు తీసుకురావాలని ఆయన సూచించారు.
ఆడపడుచుల శ్రేయస్సు దృష్ట్యా శిక్షలు బహిరంగంగా అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. నేరాల స్థాయిని బట్టి అది మరణ శిక్ష అయినా, మరే ఇతర శిక్ష అయినా సరే బహిరంగంగా అమలు జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆడపిల్లల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కఠిన చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
కొద్ది రోజుల క్రితం బెత్తాలతో రెండు దెబ్బలను చమ్డాలు తెగేలా జరగాలని పవన్ వ్యాఖ్యానించగా, దానిపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.