రాజకీయ కారణాలు ఎన్నయినా ఉండవచ్చు… కానీ పాలకులకు ప్రజల సంక్షేమం విషయానికి వచ్చినప్పుడు అవి ప్రభావితం చేయకూడదు. కానీ చంద్రబాబునాయుడుకు ఇవేవీ పట్టవు. జగన్ తీసుకున్న నిర్ణయాలు తప్పని టముకు వేయడమే ఆయన లక్ష్యం.
జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఏపీకి పొరుగురాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా కూడా.. ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని ప్రకటించడం కూడా ఒకటి. దానిని చంద్రబాబు ఇప్పుడు తప్పు పడుతున్నారు.
తన పరిపాలన సాగించిన రోజుల్లో చంద్రబాబునాయుడు.. రాజకీయ లెక్కలు వేసి.. అయినవారికి దోచిపెట్టే కుట్రల్లో భాగంగా.. పొరుగురాష్ట్రాల్లోని ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ వర్తించకుండా చేసేశారు. ఉదాహరణకు ఒక నిర్దిష్టమైన జబ్బుకు హైదరాబాదులో మాత్రమే మంచి, సరైన వైద్యం దొరికే అవకాశం ఉన్నప్పటికీ.. పేద రోగికి ఆ అవకాశం లేదు.
ఏపీలో ఉండే ఆస్పత్రుల్లోనే అయినకాడికి వైద్యం చేయించుకుని దేవుడిదే భారం అని ఊరుకోవాల్సిందే. ఆ రకంగా కొన్ని వందల ప్రాణాలు బలైపోయాయి కూడా. సాధారణంగా.. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల వారికి చెన్నై, బెంగుళూరు, హైదరాబాదు ఆస్పత్రులు సౌకర్యంగా ఉంటాయి. దీర్ఘకాలిక చికిత్స కోసం తిరగడం వారికి సులువు అవుతుంది.
కానీ చంద్రబాబు అక్కడ చికిత్స పొందే అవకాశం లేకుండా చేశారు. వందల ప్రాణాలు బలిగొన్నారు. జగన్ వచ్చాక ఆ విషయంలో నిబంధనలు సడలించడంతో ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. చికిత్సలకు యాతన లేదని అనుకున్నారు. అయితే చంద్రబాబు దానిని తప్పుపడుతున్నారు. మనరాష్ట్రంలో ఆదాయాన్ని ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెడతారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ప్రజల ప్రాణాలను ఖర్చు- వ్యాపారం, రాజకీయం-ఓట్లుగా చూసే అలవాటు చంద్రబాబునాయుడుకు ప్రతిపక్షంలోకి చేరిన తర్వాత కూడా తగ్గినట్టు లేదు. పొరుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వర్తించే నిర్ణయాన్ని చంద్రబాబునాయుడు తప్పుపట్టడం మీద సర్వత్రా ప్రజల్లో ఈసడింపు వ్యక్తం అవుతోంది.