వైఎస్సార్సీపీ సూటిగా.. సుత్తి లేకుండా!

ఏపీ హై కోర్టు తీర్పు విష‌యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యాఖ్య‌ల‌ను కొన‌సాగిస్తూ ఉంది. రాజ్య‌స‌భ‌లో ఇప్ప‌టికే ఆ పార్టీ ఎంపీ వి.విజ‌య‌సాయిరెడ్డి ఏపీ హై కోర్టు నిస్పాక్షిక‌త‌ను శంకించ‌గా, లోక్ స‌భ‌లో…

ఏపీ హై కోర్టు తీర్పు విష‌యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యాఖ్య‌ల‌ను కొన‌సాగిస్తూ ఉంది. రాజ్య‌స‌భ‌లో ఇప్ప‌టికే ఆ పార్టీ ఎంపీ వి.విజ‌య‌సాయిరెడ్డి ఏపీ హై కోర్టు నిస్పాక్షిక‌త‌ను శంకించ‌గా, లోక్ స‌భ‌లో ఆ పార్టీ ఎంపీ  మిథున్ రెడ్డి తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున లాయ‌ర్లుగా ప‌ని చేసిన వాళ్లే ఇప్పుడు జ‌డ్జిలుగా మారి  తీర్పులు ఇస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. 

'ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలోకి చొచ్చుకు వస్తోంది. తద్వారా శాసన వ్యవస్థ నిర్మాణం నెమ్మది నెమ్మదిగా నాశనం అవుతోంది. మా రాష్ట్రంలో టీడీపీ తరఫున వాదించిన న్యాయవాదులు న్యాయమూర్తులయ్యారు. ఇలాంటప్పుడు మా రాష్ట్రంలో నిష్పాక్షికమైన తీర్పులు ఆశించలేం…'  అంటూ మిథున్ రెడ్డి కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టుగా వ్యాఖ్యానించారు. 

ఒక‌ర‌కంగా ఒక రాష్ట్రంలో న్యాయ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును శాస‌న వ్య‌వ‌స్థ శంకిస్తూ ఉంది. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై త‌మ‌కు న‌మ్మ‌కం పోయింద‌ని ప్ర‌జ‌ల నుంచి ఎన్నుకోబ‌డిన ప్ర‌జాప్ర‌తినిధి లోక్ స‌భ‌లో వ్యాఖ్యానించారు. జ‌డ్జిలు త‌మ వ్య‌క్తిగ‌త స్వార్థాల మేర‌కు, వ్య‌క్తిగ‌త ఇష్టాలు, ప్ర‌యోజనాల మేర‌కు తీర్పులు ఇస్తున్నారంటూ సాక్షాత్తు ఎంపీలు భార‌త అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌ల్లో వ్యాఖ్యానించారు.

'న్యాయమూర్తుల ఎంపికలో న్యాయమైన చర్చ జరగాలి. ఈ తీర్పులు సక్రమంగా లేవు. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ మధ్య పలుచని రేఖ ఉంది. న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ అధికారాల్లోకి చొరబడరాదు. దేశం ప్రగతి మార్గాన పయనించాలంటే మొత్తం కొలీజియం వ్యవస్థనే తొలగించాలి. దీనిపై పునరాలోచించాలి…' అని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

 ప్రధాన మంత్రి మా రాష్ట్రానికి వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి అమరావతిని ఒక కుంభకోణంగా మార్చారని అన్నారు. అవినీతికి ఏటీఎంలాగా మార్చారని వ్యాఖ్యానించారు. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరగాలని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

మ‌రి ఈ ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రు స‌మాధానం ఇస్తార‌నేది ప‌క్క‌న పెడితే, ఏపీ హైకోర్టు వ‌ర‌స తీర్పుల‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌న అభిప్రాయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పింది. త‌ద‌నంత‌ర ప‌రిణామాలు ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల్లో ఈ అంశంపై కూలంక‌ష‌మైన చ‌ర్చ అయితే జ‌రుగుతూ ఉంది.