మరిన్ని కేసుల కోసం చినబాబు ఆరాటం!

నారాలోకేష్ యువగళం యాత్ర ప్రారంభించి.. పదిరోజులు గడిచింది. పదిరోజుల్లోనే లోకేష్ ప్రసంగాల, మాటల ఫోకస్ పూర్తిగా మారిపోయింది. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధోరణితో తొలి అడుగులు వేసిన లోకేష్ వద్ద పది…

నారాలోకేష్ యువగళం యాత్ర ప్రారంభించి.. పదిరోజులు గడిచింది. పదిరోజుల్లోనే లోకేష్ ప్రసంగాల, మాటల ఫోకస్ పూర్తిగా మారిపోయింది. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధోరణితో తొలి అడుగులు వేసిన లోకేష్ వద్ద పది రోజులకే సమస్యల సరుకు అయిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు స్పాంటేనియస్ తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జనం గోలను మరచిపోయి, తన సొంత గోలను మాత్రమే ఆయన ఇప్పుడు పట్టించుకుంటున్నారు. నామీద కేసులు పెట్టేస్తున్నారు మొర్రోయ్ అని విలపిస్తున్నారు. 

ప్రజల తరఫున ఉద్యమపథంలో నడుస్తున్నప్పుడు, ప్రజాపోరాటాలను సాగిస్తున్నప్పుడు.. కేసులు నమోదు కావడం అనేది చాలా చిన్న విషయం. ఏ నాయకుడు కూడా వాటిని పట్టించుకోడు. ఏ నాయకుడు కూడా అదే పనిగా తనమీద నమోదు అయిన కేసుల గురించే మాట్లాడుకుంటూ, ప్రజల ఎదుట విలపించడు. కేసులు ఎన్నయినా రావొచ్చు గాక.. కానీ తాను ప్రజల కోసం ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్తాడు. 

నిజానికి లోకేష్ కూడా మాటల రూపంలో అలాంటి చిలకపలుకులే పలుకుతున్నాడు. నా మీద ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. వాటికి భయపడేది లేదు. పదిరోజుల్లో రెండు కేసులు పెట్టారు.. మొత్తం నాలుగువందలరోజుల్లో వందల కేసులు పెట్టుకోండి అంటూ రెచ్చగొడుతున్నారు. తన మీద పెట్టిన అన్ని కేసులు మీద తాము అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయవిచారణ జరిపిస్తానని కూడా అంటున్నారు. 

ఇలాంటి మాటలు చాలా చిల్లరగా ఉన్నాయి. పార్టీ పరువు తీసేలా ఉన్నాయి. ‘‘తాము అధికారంలోకి వచ్చిన వెంటనే’’ అనే పదాల తర్వాత.. ప్రజలకోసం ఏం చేస్తామో, ప్రజారజంక పాలన ఎలా అందిస్తామో ఎవరైనా నాయకులు చెప్పాలి గానీ.. నా మీద పెట్టిన కేసుల గురించి విచారణ సాగిస్తా.. అంటూ ఏడవడం మరీ బేలతనం. హేయంగా ఉంది. ప్రజలకు చీదర పుట్టిస్తోంది. నిజానికి తన మీద మరిన్ని కేసులు నమోదు అయితే మరింతగా ప్రజల సానుభూతి పొందవచ్చునని లోకేష్ భావిస్తున్నట్లుంది. 

ప్రజల ఎదుటకు వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడాల్సిన స్థానే.. తన సొంత ఏడుపు, తన సొంత గోల, తనమీద ఉన్న కేసుల గురించి మొర పెట్టుకునే చండాలమైన అసమర్థ ధోరణి లోకేష్ కు ఎలా వచ్చింది ? అని ఆలోచిస్తే.. అది ఆయన జీన్స్ లోనే ఉన్నదని అర్థమవుతుంది. 

చంద్రబాబునాయుడు తనను ఎవరైనా పల్లెత్తు మాట అంటే చాలు.. దాన్ని పట్టుకుని ప్రపంచమంతా తిరుగుతూ నన్ను అలా అన్నారు, నేను ఇంత గొప్ప వాడిని, నా మీద జాలి చూపించండి అంటూ ఏడుస్తుంటారు. ప్రజల సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తుంటారు. లోకేష్ కూడా అచ్చంగా అలాగే.. తండ్రి బాటలో ప్రజల సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలను ప్రజలు అసహ్యించుకుంటారని లోకేష్ కు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో!