మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై ఉక్కు పాదం మోపింది. న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని కోరిన నేరానికి ఏకంగా వేలాది మంది ఉద్యోగులను ఇంటిబాట పట్టించింది. మహారాష్ట్రలో కార్మిక వ్యతిరేక పంథాపై ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) ఉద్యోగులు నెల రోజులుగా సమ్మెబాట పట్టారు. ఇది ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై ఎంఎస్ఆర్టీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా విడతల వారీగా మొత్తం 6,277 మంది కార్మికులను సస్పెండ్ చేశారు. ఒక్క శనివారమే 3,010 మంది ఉద్యోగులను ఎంఎస్ఆర్టీసీ సస్పెండ్ చేసింది. మరో 270 మంది కార్మికులను విధుల నుంచి తొలగించడం గమనార్హం. అంతకు ముందు ఇదే సంఖ్యలో సస్పెండ్ వేటు వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికు లకు ఇచ్చిన హామీని జగన్ ప్రభుత్వం నెరవేర్చి… వాళ్ల అభిమానాన్ని చూరగొంది. ఇదే రీతిలో మహారాష్ట్రలో కూడా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్‌తో ఉద్యమిస్తుంటే.. ప్రభుత్వం అణచివేస్తుండడం గమనార్హం.