మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అసలు ఏమైందో అర్థం కావడం లేదు. అర్థంపర్థం లేని డిమాండ్లతో తనను తాను అభాసుపాలు చేసుకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి. గోదావరి పుష్కరాల్లో తన వల్ల 29 మంది చావులకు కారణమైన చంద్రబాబు… తాజాగా వరదల్లో ఏపీ ప్రభుత్వ వైఫల్యంపై న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని జనం అంటున్నారు.
చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు. అపారమైన పాలనానుభవం ఉన్న నాయకుడు ఒక డిమాండ్ చేస్తే… దానికెంతో విలువ ఉండాలి. అలాంటిది తన స్థాయిని దిగజార్చుకునేలా కేవలం ఏదో ఒకటి ఆరోపణో, విమర్శో చేయాలనే బాబు తాపత్రయం చూస్తుంటే, ఆయనపై జాలి పడడం తప్ప ఏమీ చేయలేమనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎస్ సమీర్‌శర్మకు రాసిన లేఖలో న్యాయ విచారణ డిమాండ్ చేయడం చంద్రబాబుకే చెల్లింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని బాబు విమర్శించారు. తుమ్మలగుంట చెరువును ఆట స్థలంగా మార్చారని తప్పు పట్టారు. చెరువును ఆటస్థలంగా మార్చడంతో తిరుపతిని వరదలు ముంచెత్తాయని ఆరోపించారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్.
చంద్రబాబు మాటలు వింటుంటే… అసెంబ్లీలో తన సతీమణిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధుల దూషణలపై కూడా సీబీఐ విచారణకు డిమాండ్ చేసేలా ఉన్నారనే వ్యంగ్య కామెంట్స్ వస్తున్నాయి. అలాగే తన ఏడ్పుకు కారణాలపై కూడా న్యాయవిచారణకు నేడోరేపో డిమాండ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని నెటిజన్లు వెటకరిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు అంతగా దిగజారారని మండిపడుతున్నారు.