బిగ్బాస్ సీజన్-4 రియాల్టీ షోలో ఈ దఫా గంగవ్వ ప్రత్యేక ఆకర్షణ. ఓ యూట్యూబ్ చానల్ ద్వారా పాపులర్ అయిన గంగవ్వకు సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ ఉంది. బిగ్బాస్ రియాల్టీ షోలో మొదటి వారంలోనే గంగవ్వ నామినేషన్లోకి వచ్చింది. అందరికంటే ఎక్కువ ఓట్లతో గంగవ్వ సురక్షితంగా కొనసాగుతోంది. రెండో వారం కూడా గంగవ్వ నామినేషన్లో ఉంది.
కానీ పల్లెటూరి వాతావరణంలో , విశాల ప్రపంచంలో పెరిగిన గంగవ్వ, బిగ్బాస్ హౌస్లో అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్టు ఆమె మాటలను బట్టి తెలుస్తోంది. పల్లెటూర్లో పెరిగిన ప్రాణం కావడంతో బిగ్బాస్ హౌస్లో ఆ ఇరుకు జీవితం అవ్వను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టుంది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే గంగవ్వకు కాస్త అనారోగ్యం అని తెలిసి రెండోసారి కరోనా టెస్ట్ చేసినట్టు తెలిసింది.
కరోనా నేపథ్యంలో స్టార్ట్ అయిన బిగ్బాస్ రియాల్టీ షో ప్రారంభానికి ముందు కంటెస్టెంట్లందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి, ఆ తర్వాత అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. నెగెటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత బిగ్బాస్ హౌస్లోకి పంపారు. అయితే షోలో పనిచేసే కొందరు టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం.
ఇదే సమయంలో హౌస్లో గంగవ్వ అనారోగ్యానికి గురి కావడంతో ముందు జాగ్రత్తలో భాగంగా కరోనా పరీక్ష చేసినట్టు తెలిసింది. ఇంకా ఫలితం రావాల్సి ఉంది.