ప్రధాని మోడీకి తన కేబినెట్ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ షాక్ ఇచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధ బిల్లులను నిరసిస్తూ బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ నేత, ఫుడ్ ప్రాసెసింగ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కౌర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని కార్యాలయానికి వెళ్లి తన రాజీనామా పత్రాన్ని ఆమె సమర్పించారు. వ్యవసాయ బిల్లులపై అకాలీదళ్ తన అభ్యంతరాన్ని ఎన్టీయేకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
గతంలో అకాలీదళ్ అధ్యక్షుడిగా, పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సుఖ్‌బీర్ సింగ్ బాదల్ భార్యే హర్‌సిమ్రత్ కౌర్. 11 ఏళ్ల క్రితం ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ఆమె రాజకీయాల్లోకి వచ్చి భటిండా లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. మోదీ ప్రభుత్వంలో రెండోసారి కేబినెట్ మంత్రి పదవి చేపట్టారు.
ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన రైతులకు, వ్యవసాయానికి సంబంధించిన బిల్లుల విషయంలో అకాలీదళ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. లోక్‌సభలో చర్చలో భాగంగా ఆ పార్టీ నేత సుఖబీర్ బాదల్ నిరసన వ్యక్తం చేశారు. అలాగే పార్లమెంట్‌లో జరిగే ఓటింగ్‌లో రెండు బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.
ఇదే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయడానికి దారి తీసింది. అయితే కేంద్ర మంత్రిగా వైదొలుగుతున్నప్పటికీ … ఎన్డీయేలో కొనసాగుతామని ఆ పార్టీ స్పష్టం చేసింది.