గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు తీర్పులు, ఆదేశాలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఒక వర్గానికి అనుకూలంగా కోర్టు వ్యవహరిస్తోందనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయ పడిన విషయం తెలిసిందే.
మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి రమేశ్, అలాగే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఇద్దరు కుమార్తెల పేర్లు రాజధాని భూముల వ్యవహారంలో ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో ఉండడం, ఆ కేసు విచారణపై స్టే విధించడంతో పాటు కనీసం ఆ సమాచారాన్ని మీడియా రాయకూడదని హైకోర్టు చీఫ్ జస్టిస్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం దుమారం రేపుతోంది.
ఈ విషయమై నిన్న పార్లమెంట్లో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రస్తావించారు. నేడు కూడా ఆ పరంపర కొనసాగింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజ్యసభలో గురువారం మాట్లాడుతూ ఏపీ హైకోర్టుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే…
“ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు. న్యాయ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత, పక్షపాతంతో ఉంది. ఈ ధోరణి వెంటనే మానుకోవాలి. న్యాయ వ్యవస్థ కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోంది. మీడియా, సోషల్ మీడియాపై నిషేధం విధించింది. మాజీ అడ్వకేట్ జనరల్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ను రిపోర్టు చేయవద్దని నిషేధం విధించింది. బ్రిటిష్ తరహాలో వ్యవహరిస్తూ.. దీనికి సంబంధించిన మరో కేసు పైన కూడా స్టే విధించారు.
గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలా వ్యవహ రిస్తున్నారు. మీడియా కవరేజ్, పబ్లిక్ స్క్రూటినీ లేకుండా తప్పించుకోవాలని చూస్తున్నారు. జ్యుడీషియల్ నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ కరోనా నియంత్రణలో ముందంజలో ఉంది” అని తెలిపారు.
ఏపీ సర్కార్ ధోరణి చూస్తుంటే హైకోర్టు వ్యవహారాన్ని సీరియస్‌గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఒక్కొక్కరు ఒక్కో వేదికపై నుంచి హైకోర్టుకు హితవు పలుకుతుండడం దేశ వ్యాప్త దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు కనీసం ఎఫ్ఐఆర్ గురించి కూడా మీడియా రిపోర్ట్ చేయవద్దని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశించడం దేశంలోని పలువురు ప్రసిద్ధ జర్నలిస్టులు, న్యాయకోవిదులు తీవ్ర అభ్యంతరం, నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత చట్టసభలైన లోక్‌సభ, రాజ్యసభల్లో వైసీపీ సభ్యులు ఏపీ హైకోర్టుపై ఘాటు వ్యాఖ్యలతో పాటు హితవు చెబుతుండడం …మొత్తం దేశ వ్యాప్త దృష్టిని ఆకర్షించడంతో పాటు ఆలోచింపజేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు తీర్పులు, ఆదేశాలపై దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు. మేధావులు, ఆలోచనాపరులు ఆరా తీస్తుండడం గమనార్హం.