మొత్తానికి మళ్లీ డేట్ వచ్చింది. అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాకు. సంక్రాంతికి వస్తామని హడావుడి చేసారు. నిర్మాత వస్తుందన్నారు. దర్శకుడు రాదని చెబుతున్నారు అన్న మాటలు వినిపించాయి. చివరకు అదే జరిగింది. సంక్రాంతికి రావాల్సిన సినిమా ఏప్రిల్ లో వస్తోంది. ముందుగా ఏప్రిల్ 14 అని వినిపించింది. కాదు 28 అని ఫిక్సయింది.
గతంలో సూపర్ డూపర్ హిట్ లు వున్న డేట్ ఇది అంటూ ఓ చిన్న విడియో బైట్ కూడా వదిలారు. అంటే సక్సెస్ సెంటి మెంట్ ను బలంగా నమ్ముకున్నట్లే కనిపిస్తోంది. విడుదల తేదీ తో పాటు అఖిల్ క్లోజప్ స్టిల్ కూడా వదిలారు. చాలా వైల్డ్ గా, వైర్డ్ గా వుంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. అఖిల్ మజిల్ బాడీ, వైల్డ్ లుక్ ను బాగా ఎలివేట్ చేసినట్లు కనిపిస్తోంది.గమ్మత్తేమిటంటే ఇలాంటి లైన్ తోనో, జానర్ తోనో మరో తెలుగు సినిమా కూడా రెడీ అయి వుందని, కానీ ఏజెంట్ ముందు విడుదలవుతోందనీ టాక్ వినిపిస్తోంది.
అక్కినేని ఫ్యామిలీలో మంచి సక్సెస్ డ్యూ వున్నది అఖిల్ కే. ఈ లోటు ఈ సినిమా తీరుస్తుందని అనుకోవచ్చు. ముఖ్యంగా ఫ్యాన్స్ అదే నమ్మకంతో వున్నారు. సక్సెస్ తరువాత ఫ్లాప్..ఫ్లాప్ తరువాత సక్సెస్ అన్నది సురేందర్ రెడ్డి గ్రాఫ్. అదే లెక్కలో చూసుకున్నా సైరా తరువాత కనుక హిట్ కొట్టేలాగే వున్నారు.