బహుశా స్వతంత్ర భారతదేశంలో అదో చిత్రమైన వ్యవహారం! వాక్ స్వతంత్రం మెండుగా ఉన్న ఈ దేశంలో పెద్ద పెద్ద రాజకీయ నేతలు కూడా తప్పించుకోలేకపోయారు! ఎంతో సమర్థవంతమైన పాలకులు, దేశానికి ఎంతో చేసిన వారు కూడా రకరకాల అభియోగాలు ఎదుర్కొన్నారు. వారు దేశానికి ఏం చేశారనేది పక్కన పెట్టి వారి గురించి అడ్డగోలు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు, నిందలకూ ఎవరూ అతీతం కాదు పాపం!
మహత్మాగాంధీ గురించినే సోషల్ మీడియాలో రకరకాలుగా రాస్తుంటారు. తన జీవితాన్ని తెరిచిన పుస్తకంగా ఉంచిన గాంధీ గురించినే ఆయన చెప్పిన విషయాలపై తప్పుడు భాష్యాలను చెప్పుకునే దేశం మనది! గాంధీనే వదలని మన దేశంలో నెహ్రూ, ఇందిర, పీవీ, వాజ్ పేయి.. ఇలాంటి వారెవరూ అతీతం కాదు.
పీవీ అయితే తన జీవిత చరమాంకంలో కోర్టులకు తిరగాల్సి వచ్చింది! ఒక్క పీవీ అనే కాదు.. దేశాన్ని ఎంతో గొప్పగా పాలించిన అనేక మంది పాలకులు కోర్టుల చుట్టూ తిరిగారు, తిరుగుతున్నారు! కొంతమంది నేతల హయాంలో చోటు చేసుకున్న చిన్న చిన్న స్కామ్ లలో కూడా వారు జైలు శిక్షను అనుభవిస్తున్నారు.
వాస్తవానికి దాణా స్కామ్ చాలా చిన్నది. లాలూకు పూర్వపు బిహార్ సీఎంలు కూడా దాన్ని చేశారు. అయితే వారు తప్పించుకున్నారు, లాలూ తప్పించుకోలేక జీవిత చరమాంకంలో జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.
తమిళనాడులో బీభత్సమైన జనాదరణతో వరసగా రెండో సారి సీఎం అయ్యాకా.. జయలలిత పీఠాన్ని వదిలి జైలు పాలయ్యారు. ఇలా మహామహులే ఈ దేశంలో చట్టానికి, కోర్టు ఆదేశాలకూ మినహాయింపు కాలేకపోయారు.
నమోదైన అభియోగాలు రుజువై.. జైలుకు వెళ్లిన వారి కథ ఒక రకం అయితే, అసలు అభియోగాల్లోనే పస లేకపోయినా జీవితాంతం కోర్టుల చుట్టూ తిరిగిన వారు, జైళ్లలో గడిపిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ రాజకీయ నేతలూ ఉన్నారు.
ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనపై నమోదైన అభియోగాల కారణంగా 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. అసలు జగన్ పై క్విడ్ ప్రో కో ఆరోపణలే నిలబడవని, అనేక మంది న్యాయనిపుణులు చెబుతూ ఉంటారు. దశాబ్దాల విచారణ అనంతరం నిర్దోషులుగా బయటపడిన వారూ ఉన్నారు. అయితే విచారణ కాలాల్లో వారు నెలల తరబడి జైళ్లలో గడిపారు.
అభియోగాలు తప్పని రుజువు అయినప్పుడు, వారిని జైళ్లలో పెట్టడం కూడా తప్పే అవుతుంది! వారు తమ జీవితంలో కీలకమైన రోజులను జైళ్లలో కోల్పోయినట్టుగా అవుతుంది. దానికి పరిహారం ఏమీ ఉండదు. దానికి ఏ న్యాయస్థానం పరిహారం ఇవ్వదు, మరే విచారణ సంస్థా చెంపలేసుకోదు! అదంతా న్యాయ ప్రక్రియలో భాగం ఈ దేశంలో!
ఇదీ ఈ దేశంలో చట్టం, న్యాయం పనిచేసే తీరు! ఆరోపణలు, అభియోగాలు వచ్చాయంటే తీసుకెళ్లి లోపలేయడమే మన చట్టం పని! ఆ తర్వాత నిర్దోషులని నిరూపించుకోవడం అవతలి వాళ్ల పని మాత్రమే! అంతా చట్టపరంగా సాగుతుంది! ఇలాంటి దేశంలో ఇప్పుడు చిత్రవిచిత్రమైన వార్తలు వస్తున్నాయి! ఆ చిత్రవిచిత్రాలు ఏమిటో విశదీకరించనక్కర్లేదు.
వాస్తవానికి ఈ కథనం ఎవరినీ ఉద్దేశించినది కాదు, ఇందులో వర్తమాన విషయాల ప్రస్తావన అస్సలు లేదు. కేవలం ఆరోపణలు ఎదుర్కొని, కోర్టుల్లో ఆ ఆరోపణలు రుజువు కాక, వాళ్ల వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయి, వ్యక్తిగత జీవితంలో దోషులుగా నిందలు ఎదుర్కొని, నెలలు- సంవత్సరాల పాటు జైళ్లలో గడిపి, చివరకు ఆరోపణలు రుజువు కాక కడిగిన ముత్యాల్లా బయటకు వచ్చిన వారికి నివాళి ఇది!
క్రికెట్ మ్యాచ్ ల ఫిక్సింగ్ వ్యవహారాల్లో కపిల్ దేవ్ కూడా నిందలు ఎదుర్కొన్నాడు, ఆయన తన గొప్పదాన్ని చెబుతూనో మరో దాన్ని చెబుతూనో విచారణ జరగకూడదని అనలేదు. విచారణ జరిగింది, కపిల్ కడిగిన ముత్యమని విచారణ సంస్థలే కితాబిచ్చాయి! అందుకే భారతీయులకు ఆరాధ్యనీయుడయ్యాడు, ఏతరానికి అయినా స్ఫూర్తి అయ్యాడు. అయితే ఆయనా జీవితంలోనూ అభియోగాలు- విచారణ అనే చీకటి రోజులున్నాయి.
ఉలి దెబ్బలను ఎదుర్కొన్న శిల శిల్పం అవుతుంది, తట్టుకోలేనిది నేల మీద బండవుతుంది!