పొత్తుకు మొదటి మెట్టు.. ముసుగు తీస్తున్న పవన్..!

అమరావతి అందర్నీ కలిపేసింది. అమరావతి పేరుతో జరుగుతున్న ఆందోళనల సాక్షిగా విపక్షాలన్నీ ఏకం అయ్యాయి. అమరావతి రైతుల యాత్రకు మొదటి నుంచీ టీడీపీ మద్దతు తెలుపుతుండగా.. ఇటీవల అమిత్ షా క్లాస్ తీసుకోవడంతో బీజేపీ…

అమరావతి అందర్నీ కలిపేసింది. అమరావతి పేరుతో జరుగుతున్న ఆందోళనల సాక్షిగా విపక్షాలన్నీ ఏకం అయ్యాయి. అమరావతి రైతుల యాత్రకు మొదటి నుంచీ టీడీపీ మద్దతు తెలుపుతుండగా.. ఇటీవల అమిత్ షా క్లాస్ తీసుకోవడంతో బీజేపీ నేతలు జాయిన్ అయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా, రాజ్యసభ సభ్యులు కూడా కలసిపోయారు. 

టీడీపీతో చెట్టపట్టాలేసుకుని తిరిగారు. ఒకరి భుజాలపై మరొకరు చేతులేసి నడుస్తున్న ఫొటోలు కూడా చూశాం. ఇప్పుడిక జనసేన వంతు వచ్చింది. జనసేన తరపున నాదెండ్ల మనోహర్ కూడా అమరావతి రైతులతో కలసిపోయారు. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జరుగుతున్న కార్యక్రమం ఇది.

నెల్లూరు జిల్లానే వేదిక..

న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేస్తున్న యాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకున్న తర్వాత బీజేపీ నేతలు వారితో కలసిపోయారు. జనసైనికులు కూడా అక్కడక్కడా మద్దతుగా యాత్రలో కలసి నడుస్తున్నా.. అధికారికంగా కీలక నేతలెవరూ వారితో కలవలేదు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ రాకతో ఆ లాంఛనం కూడా పూర్తయింది.

అమరావతి రైతుల కోసం మొదట్లో తాను కూడా అంటూ రోడ్డెక్కిన జనసేనాని, ఆ తర్వాత బీజేపీ స్టాండ్ ప్రకారం ఆ పోరాటానికి దూరం జరిగారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదంటూ ఆమధ్య బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రకటించింది. దీంతో మూడు రాజధానులకు బీజేపీ అనుకూలంగానే ఉందని అనుకున్నారంతా, వారితోపాటే జనసేన కూడా అభివృద్ధి వికేంద్రీకరణకు అనుకూలంగానే మాట్లాడింది.

తీరా ఇప్పుడు అమరావతి రైతులతో కలసి పోరాడాలంటూ అమిత్ షా ఆదేశాలివ్వడంతో బీజేపీ ప్లేటు మార్చింది. జనసేన కూడా రివర్స్ గేర్ వేసింది.

ముసుగు తొలగిపోతుందా..?

ఇప్పటివరకూ బీజేపీతోనే కలసి పోరాటాలు చేస్తున్నామని చెప్పుకున్న జనసైనికులు.. అధికారికంగా పచ్చ కండువాల పక్కకు వచ్చేశారు. టీడీపీ నేతలతో కలసి అమరావతి రైతుల పక్కన నడుస్తున్నారు. త్వరలో పవన్ కల్యాణ్ కూడా బహిరంగంగా మద్దతు తెలిపి అమరావతి రైతులతో కలసి నడిచేందుకు వస్తారనే ఊహాగానాలున్నాయి. 

అదే జరిగితే.. ఇక టీడీపీ-బీజేపీ-జనసేన ఓ కూటమిగా కలిసినట్టే. ఇప్పటివరకూ లోపాయికారీగా జరుగుతున్న వ్యవహారాలన్నీ ఇప్పుడిక తెరపైకి రాబోతున్నాయి. మొన్నటికి మొన్న చంద్రబాబు ఏడ్చిన తర్వాత గంటల వ్యవధిలోనే ప్రెస్ నోట్ విడుదలచేసి తన అభిమానాన్ని చాటుకున్నారు పవన్ కల్యాణ్. 

బాబుపై అంతెత్తున ఎగిరిపడే నాగబాబు కూడా మద్దతుగా వీడియో విడుదల చేశారు. అంటే ఒకరకంగా తామంతా చంద్రబాబుతోనే ఉన్నామనే సంకేతాల్ని అటు అభిమానులకు, ఇటు జనసైనికులకు కూడా ఇచ్చేసింది పవన్ అండ్ టీమ్. ఇప్పుడిక అమరావతిని అడ్డు పెట్టుకుని ఏకంగా పొత్తు వరకు వెళ్లేలా కనిపిస్తోంది.