మాట నిలబెట్టుకునే కులం నాది

మతం, కులం ప్రస్తావన తీసుకొస్తూ రాజకీయాలు చేస్తున్న నేతలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గుంటూరులో వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి.. ఎవరెన్ని విమర్శలు చేసినా వెనక్కి తగ్గేది…

మతం, కులం ప్రస్తావన తీసుకొస్తూ రాజకీయాలు చేస్తున్న నేతలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గుంటూరులో వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి.. ఎవరెన్ని విమర్శలు చేసినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేశారు. మరీ ముఖ్యంగా తనది మాటనిలబెట్టుకునే కులమని ప్రకటించి అందర్నీ ఆకట్టుకున్నారు.

“ఈమధ్యకాలంలో నా మతం, కులం గురించి కూడా మాట్లాడుతున్నారు. వింటుంటే నాకు చాలా బాధేస్తోంది. ఈ వేదికపై నుంచి చెబుతున్నాను, నా కులం మాటనిలబెట్టుకునే కులం, నా మతం మానవత్వం.”

ఇలా తనపై వస్తున్న విమర్శలకు తిరుగులేని సమాధానం ఇచ్చారు జగన్. తనకు మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నీ అని ప్రకటించిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో మంచి పనులు జరుగుతుంటే చాలామంది తట్టుకోలేకపోతున్నారని పరోక్షంగా చంద్రబాబు, పవన్ పై విమర్శలు చేశారు.

“మంచి జరుగుతున్నప్పుడు సహజంగానే చిన్నచిన్న విషయాల్ని కూడా పెద్దవి చేసి చూపిస్తుంటారు. నేను ఒకటే చెబుతున్నాను. ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా గట్టిగా నిలబడతాను. ప్రజల దీవెనల మీదే నమ్మకం ఉంచాను.”

తనను, తన ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించడానికి ఎవరెన్ని కుట్రలు చేసినా తన ఉక్కుసంకల్పం చెక్కుచెదరని స్పష్టంచేశారు జగన్. ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలనే ఆరాటంతోనే పనిచేస్తున్నానని, ఇకపై కూడా తన పరిపాలన ఇలానే ఉంటుందని స్పష్టంచేశారు. అవాకులు, చెవాకులు పట్టించుకునేంత టైమ్ తనకు లేదన్నారు.