కాలం తిమ్మిని బమ్మిని చేస్తుంది. బమ్మిని తిమ్మిని చేస్తుంది. ఓడలు బళ్లు, బళ్లు ఓడలవుతాయి. ఒకప్పుడు ప్రజాభిప్రాయాన్ని అనువుగా మార్చే శక్తి ఉన్న ఈనాడు, ఉద్యమాన్ని నిర్మించగలిగే సత్తా ఉన్న ఈనాడు ఇప్పుడు చతికిలపడింది. బాబు అరెస్ట్ అయితే ఈనాడు తీవ్రమైన ఉద్యమాన్ని నకిలీ పద్ధతిలో సృష్టించగలిగేది. అయితే అది గతం. ప్రతిదాన్ని క్రాస్ చెక్ చేసే సోషల్ మీడియా వుంది. జగన్ సొంత సాక్షి ఎలాగూ వుంది. సాక్షిని నమ్మని వాళ్లు కూడా సోషల్ మీడియాని నమ్ముతారు.
తెలుగుదేశం పుట్టే నాటికి, కాంగ్రెస్ భ్రష్టు పట్టిన మాట నిజమే. అయితే చేసే అరకొర మంచి పనుల్ని కూడా చెప్పే మీడియా కాంగ్రెస్‌కి లేకుండా పోయింది. ఈనాడు రాసేవన్నీ నిజాలుగా మారిపోయాయి.
ఎన్టీఆర్‌ని అధికారంలోకి తీసుకురావడానికి ఈనాడు చేసిన కృషి అంతాఇంతా కాదు. ఆ తర్వాత తాను రాజకీయాల్ని మార్చగలనని ఆత్మ విశ్వాసం, అహంకారం రామోజీలో ప్రవేశించింది. స్వయంతప్పిదాలకి బలై 1989లో ఎన్టీఆర్ ఓడిపోయారు. 94లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఈనాడు సంపూర్ణ మద్యనిషేధం అనే ఉద్యమాన్ని నిర్మించింది. పేజీలకి పేజీలు వేసి మాగుంట వ్యాపారాన్ని దెబ్బ తీసింది.
ఎన్టీఆర్ నుంచి బాబుకి అధికారం రావడానికి ఈనాడు శాయశక్తులా పోరాడింది. కమ్యూనికేషన్ లేని ఆ రోజుల్లో బాబు వెంట అత్యధిక ఎమ్మెల్యేలు అంటూ ఈనాడు చేసిన ప్రచారాన్ని అందరూ నమ్మారు. 2004 వరకూ చంద్రబాబు ఒక అద్భుతం, అమోఘం అంటూ భజన చేసింది. తాను నిర్మించిన మద్య నిషేధ ఉద్యమాన్ని తానే నీరుగార్చింది.
వైఎస్ వచ్చిన తర్వాత ఈనాడుకి కష్టకాలం ప్రారంభమైంది. అయితే తమ వాయిస్ వినిపించే పత్రిక లేదని గ్రహించిన జగన్ “సాక్షి” ప్రారంభించారు. ఈనాడుకి కౌంటర్ చెక్ మొదలైంది. వైఎస్ అనంతరం సాక్షి లేకపోతే ఈనాడు, జ్యోతి కలిసి ఆయన్ని రాజకీయ భూస్థాపితం చేసేవాళ్లు. మీడియా బలంతో జగన్ నిలదొక్కుకున్నాడు.
జగన్ సీఎం అయిన తర్వాత ఈనాడు ఆత్మరక్షణలో పడింది. మార్గదర్శి కేసులో రామోజీ అరెస్ట్ వరకూ వచ్చే సరికి భయం మొదలైంది. ఎల్లకాలం తనదే జరగదు, ప్రత్యర్థి సామాన్యుడు కాదని అర్థమైంది.
ఇపుడు బాబు అరెస్ట్. లోకేశ్ కూడా అరెస్ట్ అవుతాడని వార్తలు. మునుపటి కాలమైతే నలుగురు కలిస్తే ధర్నా, నిరసన అంటూ పేజీల కొద్దీ పరిచేది. అయితే ఇపుడు జనం ఈనాడు వార్తల్ని నమ్మరు. సోషల్ మీడియాలో చెక్ చేసుకుంటారు. సోషల్ మీడియా, సాక్షి లేకపోతే బాబుకి అనుకూలంగా ఒక ఫేక్ ఉద్యమాన్ని ఈనాడు నిర్మించి వుండేది. కానీ రామోజీకే కాదు, ఆ పత్రికకి కూడా ముసలితనం వచ్చేసింది.