వైఎస్ షర్మిల, రాజశేఖరరెడ్డి కూతురు, జగన్ చెల్లి.
బ్రాహ్మణి బాలకృష్ణ కూతురు, ఎన్టీఆర్ మనుమరాలు, చంద్రబాబు కోడలు, లోకేశ్ సతీమణి.
వీళ్లిద్దరిని పోల్చుకోకూడదు. ఇద్దరూ విభిన్న వ్యక్తులు. అయితే ఇద్దరి నేపథ్యం ఒక్కటే. రెండు కుటుంబాల్లోనూ రాజకీయ నాయకులున్నారు. షర్మిల తండ్రి, అన్న ముఖ్యమంత్రులు. బ్రాహ్మణి తాత, మామ ముఖ్యమంత్రులు.
జగన్ జైల్లో ఉన్నపుడు, షర్మిల పార్టీని నడిపారు. ఒక రకంగా బతికించారు. జగనన్న వదిలిన బాణంగా పాదయాత్ర చేశారు. రాజకీయంగా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ, జనం ఎమోషన్స్‌ని అనుకూలంగా మార్చుకోవడం షర్మిలకి తెలుసు. కారణాలు ఏవైతేనేం అన్నతో విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టారు. అక్కడ వర్కౌట్ కాదని అందరికీ తెలుసు.
షర్మిలకి కూడా తెలిసి వేరే దారి లేక తెలంగాణాని ఎంచుకున్నారేమో తెలియదు. అక్కడ ఆమె ఫెయిల్యూర్. ఇప్పుడు కాంగ్రెస్ వాకిట ఉన్నారు. ఆమె స్థానం ఏమిటో ఎవరికీ తెలియదు. అయితే రాజకీయాల్లో షర్మిల తనని తాను నిరూపించుకున్నారు. పోరాడే మహిళగా, రాజకీయాల్లో మొండిగా నెగ్గుకు రాగలిగిన తత్వం ఆమెలో వుంది. కాలం కలిసి వచ్చి, రేపు కాంగ్రెస్ రాజకీయాల్లో నేషనల్ లెవెల్ ఆమెకి దక్కవచ్చు, దక్కకపోవచ్చు. ఏమైనా ఆమె ఒక ఫైర్ బ్రాండ్. అందరూ అంగీకరించే సత్యం.
బ్రాహ్మణి తండ్రి చాటు బిడ్డ, పెళ్లయిన తర్వాత మామ ఇంటి కోడలు. వ్యాపార రంగంలో ఆమె సాధించిన విజయాలేవో ప్రపంచానికి తెలియదు. బాబు అరెస్ట్ తర్వాత మాత్రమే ఆమె రాజకీయాలు మాట్లాడారు. ఆమెకి అవగాహన లేదు, పరిపక్వత లేదు. రాజకీయ గాఢత వుండే అవకాశం లేదు. కానీ సమయం, సందర్భం కొందరిని నాయకుల్ని చేస్తుంది.
రేపు ఒక వేళ లోకేశ్ కూడా అరెస్ట్ అయితే పార్టీ శ్రేణులు డీలా పడకుండా వుండడానికి బ్రాహ్మణి పేరు రంగంలోకి తెచ్చారు. బాలకృష్ణ కొంత ఉత్సాహపడినా, ఆయన ఎవరి మాట వినరు. తలనొప్పి తెచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకని సేఫ్ సైడ్‌గా బ్రాహ్మణి పేరు వచ్చింది. ఆమె యాక్టీవ్‌గా రేపు రాజకీయాల్లోకి రావచ్చు కూడా.
పాలిటిక్స్‌లోకి ఎవరైనా రావచ్చు. మన దేశంలో వారసత్వ రాజకీయాలకి డిమాండ్ ఎక్కువ. ఆ విధంగా బ్రాహ్మణి కరెక్ట్. అయితే ఆరు నెలల్లో ఎన్నికలు. ఈ తక్కువ గ్యాప్‌లో ఆమె నేర్చుకుంటారా? అభాసుపాలవుతారా? అన్నది కాలమే నిర్ణయించాలి.