నారా లోకేష్. తెలుగుదేశానికి సరిసాటీ పోటీ లేని ఏకైక రాజకీయ వారసుడు. నిజానికి నందమూరి వంశీకుల నుంచి పోటీ ఉండాలి. కానీ చంద్రబాబు నుంచి నారా వంశం వారసుడిగా లోకేష్ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సులువుగానే పగ్గాలు అందుకున్నారు. ఆయన తన గురించి ప్రతిభ గురించి జనాల ముందు ఏమీ రుజువు చేసుకోక ముందే అయిదు కీలక శాఖలకు మంత్రిగా రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించారు.
ఇపుడు లోకేష్ నాలుగు వందల రోజుల పాటు భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. లోకేష్ పాదయాత్ర ఎలా సాగుతోంది అంటే వైసీపీ ప్యాంట్లు తడిసిపోయేలా అని తమ్ముళ్ళు ఎవరైనా అనుకుంటారేమో. కానీ జాలి కలిగేలా అని అంటున్నారు వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్. లోకేష్ పాదయాత్రను చూసి జాలి పడుతున్నానని గుడివాడ సెటైరికల్ గా అంటున్నారు.
లోకేష్ కి నాయకత్వ లక్షణాలు లేవని కానీ ఇంటి పోరు వల్లనే చంద్రబాబు బలవంతంగా ఆయన్ని ఫోకస్ చేయాల్సి వస్తోందని గుడివాడ గుట్టు చెబుతున్నారు. తెలుగుదేశానికి అసలైన నాయకుడు లోకేష్ అని ఎస్టాబ్లిష్ చేయడానికి పాదయాత్ర అన్న భారీ ప్రోగ్రాం ని రెడీ చేశారని అన్నారు. పాదయాత్ర జరుగుతున్న తీరు చూస్తే లోకేష్ కి అది ప్లస్ అవుతోందా లేక మైనస్ గా మారుతోందా అన్న డౌట్లు వస్తున్నాయని గుడివాడ హాట్ కామెంట్స్ చేశారు.
లోకేష్ పాదయాత్ర ఆరంభం రోజున చంద్రబాబు వచ్చి అండగా నిలబడితే ఎంతో కొంత ఊపు వచ్చేదని అలా కాకుండా ఆయన్ని అలా రోడ్డు మీద విడిచిపెట్టేశారని అన్నారు. దీనిని బట్టి చూస్తే అధికారం ముందు మామ అయినా కొడుకు అయినా తనకు ఒక్కటే అని చంద్రబాబు చెప్పకనే చెబుతున్నట్లుగా ఉందని గుడివాడ అంటున్నారు. లోకేష్ పరిస్థితి చూస్తే భారీ పాదయాత్ర ఎలా పూర్తి చేస్తాడో అని అనిపించకమానదని ఆయన అన్నారు.
గుడివాడ చెప్పినట్లుగా నిజంగా లోకేష్ పాదయాత్ర అలా జాలి పడేలా సాగుతోందా. తమ్ముళ్ళు దీన్ని కౌంటర్ చేయవచ్చేమో కానీ కరెక్ట్ గా ఆలోచిస్తే మాత్రం పాదయాత్ర ప్రభావం అయితే పెద్దగా లేదనే అంటున్నారు. దీనికి కారణం ఎవరు అన్నది వారే ఆలోచించుకోవాలేమో.