కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు. సినిమాల్లో ఈ డైలాగ్ పవన్ కి అతికినట్టు సూటవుతుంది. టాలీవుడ్ లో ఆ కటౌట్ కి అంత బ్రాండ్ వేల్యూ ఉంది. కానీ రాజకీయాల్లో ఆ కటౌట్ దేనికీ పనికి రాదని ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. కానీ పవన్ ఇంకా ఆ కటౌట్ రాజకీయాలే చేయాలనుకుంటున్నారు. కంటెంట్ లేదని జనాలకి తెలుసు కాబట్టి, కనీసం కటౌట్ తో అయినా మేనేజ్ చేయాలనుకుంటున్నట్టుంది.
ఓవైపు వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే చేపట్టారు, మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం వెక్కి వెక్కి ఏడ్చిన బాధలో కూడా జిల్లాల పర్యటనలకు వచ్చారు. బీజేపీ నుంచి కీలక నేతలు, కాలు వాచిపోయినా కుంటుకుంటూనే సీపీఐ నారాయణ.. ఇలా అందరూ రోడ్లెక్కారు. కానీ పవన్ మాత్రం ఇంట్లోనే కూర్చున్నారు.
తన తరఫున, వరద బాధితులను పరామర్శించేందుకు తన ఆత్మ నాదెండ్ల మనోహర్ ని పంపారు జనసేనాని. పాపం నాదెండ్ల ఏం చేస్తారు. వరద సహాయం మినహా.. మిగతా ఏ రాజకీయ అంశాన్ని కూడా టచ్ చేయకుండా క్లాస్ గా తిట్టి వెళ్లిపోతున్నారు. ఇదెక్కడి కటౌట్ రాజకీయం? కనీసం ఇప్పుడైనా జనాల్లోకి రాకపోతే ఇంకెప్పుడు పవన్ ని జనం నమ్మాలి.
తిరుపతి ఉప ఎన్నికలకు ముందు టికెట్ కన్ఫామ్ చేసే దశలో పవన్ ఆ ఏరియా మొత్తం సర్వే చేపట్టారు. ప్రజలతో కలసి నేలపై కూర్చున్నారు, వర్షాలను సైతం లెక్క చేయకుండా బయట తిరిగారు. చివరకు టికెట్ జనసేనకు రాకపోయే సరికి సగం ప్రచారంలోనే చాప చుట్టేశారు. అవసరం ఉంటే అలాంటి రాజకీయాలు చేస్తారు పవన్, కానీ ఇక్కడ కనీసం వరద బాధితుల్ని పరామర్శించేందుకు సైతం పవన్ కల్యాణ్ రాలేదు.
పోనీ ఆయనేమైనా బిజీగా ఉన్నారా అంటే అదీ లేదు. అటు షూటింగ్ లకు కూడా గ్యాప్ ఇచ్చారు. తన మాజీ బాస్ చంద్రబాబు ఏడిస్తే.. వెంటనే ప్రెస్ నోట్ విడుదల చేసేంత తీరిక కూడా ఉంది. కానీ అసలు సిసలు బాధితులకు మాత్రం కాస్త ఓదార్పునిచ్చేందుకు కూడా జనసైనికుడు జన సేవకుడిగా మారలేదు.
స్వయంగా తను రంగంలోకి దిగి చేయాల్సిన పనుల్ని కూడా నాదెండ్ల లాంటి పార్టీ జనాలకు అప్పగించి తను చేతులు దులుపుకుంటున్నారు. అన్నిటికీ కటౌట్ తోనే పనులు జరిగిపోతాయనుకుంటుంటారు. కానీ పవన్ కటౌట్ కి సినిమాల్లో ఉన్న వేల్యూ రాజకీయాల్లో లేదు.
ఆ విషయం పవన్ ఎప్పటికి తెలుసుకుంటారో.. ఆ లోగా పాతికేళ్ల ప్రస్థానం ఖర్చయిపోతుందేమో..? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను వర్క్ ఫ్రం హోమ్ సీఎం అంటూ విమర్శిస్తున్న పవన్ కల్యాణ్.. తను చేస్తోంది వర్క్ ఫ్రం సెట్స్ పద్ధతి అనే విషయాన్ని ఎప్పుడు గ్రహిస్తారో?