రాజధాని విశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధిని ఆయన భార్య వైఎస్ భారతి సారథ్యం వహిస్తున్న సాక్షి మీడియా ప్రశ్నార్థకం చేసింది. విశాఖే రాజధాని అని దేశ రాజధాని వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ధీమాగా, ధైర్యంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయాన్ని రాయడానికి సాక్షి పత్రికకు ఎందుకో ధైర్యం చాల్లేదు. తమ బాస్ తప్పు మాట్లాడారని ఆ మీడియా భావిస్తున్నదా, లేక ఉద్దేశ పూర్వకంగా విశాఖ రాజధాని అనే అంశాన్నిపతాక శీర్షికతో ప్రచురించకుండా చేసిందా? అనేది చర్చనీయాంశమైంది.
విశాఖలో మార్చి 3,4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు సన్నాహకంగా దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ దౌత్యవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధుల సమావేశంలో జగన్ రాజధాని విషయమై కీలక ప్రకటన చేశారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నం అవుతుందని, తాను కూడా అక్కడికే మకాం మార్చనున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించారు. ఢిల్లీ వేదికగా జగన్ రాజధానిపై చేసిన ప్రకటన ఏపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఒకవైపు రాజధానిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా, సీఎం అలాంటి ప్రకటన చేయడం కోర్టు ధిక్కరణే అవుతుందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.
అయితే విశాఖే రాజధాని అంటూ ఎల్లో మీడియాకు చెందిన పత్రికలు బ్యానర్ కథనాల్ని ఇవ్వడం గమనార్హం. కానీ జగన్ సొంత పత్రిక సాక్షి మాత్రం ఆ విషయాన్ని విస్మరించడం పలు అనుమానాలకు తెరలేచింది. “పెట్టుబడులతో రండి” అంటూ ఆ పత్రిక తాటికాయంత అక్షరాలతో బ్యానర్ కథనాన్ని ఇవ్వడం విశేషం. ఇంట్రోలో మాత్రం రాజధాని అంశాన్ని సాక్షి పత్రిక రాసుకొచ్చింది.
“విశాఖపట్నం త్వరలో కార్యనిర్వాహక రాజధాని కాబోతోంది. రానున్న కొద్ది నెలల్లో నేను కూడా విశాఖకు షిప్ట్ అవుతున్నా. విశాఖ నిర్వహించే సదస్సుకు హాజరు కావాలని మీ అందరినీ కోరుతున్నా. మీతో పాటు మీ సహచరులు, ఇతర కంపెనీల ప్రతినిధులను కూడా సదస్సుకు తోడ్కొని వచ్చి ఏపీలో పరిశ్రమల స్థాపన, వ్యాపారం ఎంత సులభతరమో తెలియజేయాలి అని సన్నాహక సదస్సులో జగన్ అన్నట్టు రాశారు.
ఇంతకు మించి సాక్షి రాజధాని విశాఖగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వెనుక మతలబు ఏమై వుంటుందనే చర్చ జరుగుతోంది. కానీ విశాఖకు రాజధాని తరలించాలనే చిత్తశుద్ధి, నిబద్ధత జగన్‌లో లేదని, ఇందుకు సాక్షి పట్టించుకోకపోవడమే నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి ట్వీట్ చేయడాన్ని గమనించొచ్చు. ఈ గందరగోళం ఏంటని ఆయన నిలదీశారు.