పచ్చగూటికి చేరదలచుకున్న మరో ఫిరాయింపు చిలక.. చిలకపలుకులు పలుకుతోంది. బాబు నేర్పిన మాటల స్క్రిప్టుతో చిలకపలుకులు పలుకుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి, ఎమ్మెల్యేగా ఉంటూ, సొంత పార్టీకి చేటు చేసేలా వ్యవహరిస్తున్న కొందరు నాయకులు.. తెలుగుదేశం తీర్థం పుచ్చుకోడానికి సిద్ధపడి.. అనర్హత వేటుకు భయపడి ఆ పని వెంటనే చేయకుండా చిలకపలుకులు వల్లిస్తున్నారు. అయితే ఉన్నపార్టీని, తమను గెలిపించిన పార్టీని వదలిపోయే ముందు ప్రజలకు సంజాయిషీ చెప్పాలనే సంగతి వారికి తెలుసు. కాకపోతే.. అలాంటి ఫిరాయింపుదారులందరూ తమ సొంత పార్టీ వైసీపీ మీద ఒకటే రకం నిందలు వేస్తున్నారు. దీన్ని బట్టిచూస్తే ఫిరాయింపు చిలకలు అందరికీ చంద్రబాబునాయుడు ఒకటే స్క్రిప్టు పంపినట్టుగా కనిపిస్తోంది.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశంలో చేరడానికి మానసికంగా సిద్ధమైపోయారు. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో చాలాకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆనం రామనారాయణరెడ్డి తాజాగా కొత్త నింద వేశారు. ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేయిస్తున్నదని, సొంత ఎమ్మెల్యే ఫోనునే ట్యాప్ చేయించడం చాలా బాధగా ఉన్నదని సెలవిచ్చారు. కొన్ని రోజుల కిందట ప్రభుత్వం తన ఫోను ట్యాప్ చేయిస్తున్నదని ప్రకటించిన మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా తాను వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం తరఫున బరిలో ఉండబోతున్నానని కూడా తేల్చి చెప్పేయడం గమనార్హం.
నెల్లూరు జిల్లాలో ఈ ఇద్దరు నాయకులూ తెలుగుదేశం పంచన చేరడానికి సిద్ధపడి.. ఇద్దరూ ఒకేరకంగా ప్రభుత్వం మీద ఫోను ట్యాపింగ్ నింద వేయడం గమనించాల్సిన అంశం. గతంలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నప్పుడు.. దానికి విరుగుడుగా కేసీఆర్ సర్కారు మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి.. గండం తప్పించుకున్న చంద్రబాబునాయుడుకు ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ఎంత బలమైన కేసు అవుతుందో స్పష్టత ఉంది. అందుకే జగన్ సర్కారు మీద కూడా వైసీపీ ఎమ్మెల్యేలతోనే ఫోను ట్యాపింగ్ ఆరోపణలు చేయిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
తమాషా ఏంటంటే.. చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ఇతర ముఖ్య నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేస్తున్నారంటూ.. తెలుగుదేశం పార్టీ గూటిచిలక వర్ల రామయ్య కూడా ఇటీవలే ఆరోపణలు గుప్పించడం. వీళ్లందరికీ చంద్రబాబునాయుడు ఒకే ఒక్క స్క్రిప్టును పంపి.. ఒక వ్యూహం ప్రకారం ప్రభుత్వం మీద మాటల దాడి చేస్తున్నట్టుగా అర్థమవుతోంది.