ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బలహీనతల్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బయటపెట్టారు. క్షేత్రస్థాయిలో టీడీపీ ఏ మాత్రం బలఫడలేదని కోటంరెడ్డి తాజా వ్యాఖ్యలే నిదర్శనం. వైసీపీ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రానున్న రోజుల్లో తాను నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో వుంటాననడం, ఆ మాటలకు ఎల్లో మీడియా ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.
తమ పార్టీ తరపున పోటీ చేస్తానని ప్రకటించడానికి కోటంరెడ్డి ఎవరనే ప్రశ్న టీడీపీ నుంచి రాలేదు. పోగా ఇదేదో గొప్ప విషయం అన్నట్టు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేయడం, ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో రుజువు చేస్తోంది.
వైసీపీ నుంచి ఎవరైనా వస్తే తప్ప టీడీపీకి అభ్యర్థులే లేరనే సంకేతాల్ని ఎల్లో మీడియా తీసుకెళ్తోంది. ప్రస్తుతం వైసీపీ అధిష్టానంపై కోటంరెడ్డి తీవ్ర అసంతృప్తితో వున్నారు. కార్యకర్తలతో ఆయన అన్న మాటలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఏమన్నారంటే… “వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను. జగన్ సర్కారుతో నాకు అవమానాలే తప్ప ఒరిగిందేమి లేదు” అని అన్నారు.
కోటంరెడ్డి లేకపోతే నెల్లూరు రూరల్‌కు అసలు టీడీపీకి అభ్యర్థులే లేరా? ఏంటీ దుస్థితి? నాలుగు దశాబ్దాలకు పైబడి చరిత్ర కలిగిన టీడీపీకి అభ్యర్థిని పక్క పార్టీ నుంచి తెచ్చుకోవాల్సిన దయనీయ స్థితిపై ఆలోచించుకోవాల్సిన అవసరం టీడీపీకి లేదా? నెల్లూరు రూరల్ మాత్రమే కాదు, మరో 40 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి వున్నట్టు వార్తలొస్తున్నాయి. వైసీపీ టికెట్ ఇవ్వకపోతే, తమ వైపు వస్తారనే ఆశతో టీడీపీ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వైపు ఎదురు చూస్తోంది. టీడీపీ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒకవైపు వైసీపీ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత వుందని ప్రచారం చేస్తున్న టీడీపీ, తన పార్టీని బలోపేతం చేసుకోకుండా ఏం చేస్తున్నట్టు? కోటంరెడ్డి ఎపిసోడ్లో నీతి ఏంటంటే…. టీడీపీ అభ్యర్థులను కూడా వైసీపీ నుంచే నిలబెట్టాల్సి వస్తోంది. కోటంరెడ్డి వ్యాఖ్యలకు టీడీపీ సిగ్గుపడడం మానేసి… ఎందుకు గర్వపడుతున్నదో ఎవరికీ అర్థం కావడం లేదు. తనను తాను తక్కువ చేసి టీడీపీ చూపించుకుంటోందంటే… ఆ పార్టీ పతనాన్ని అర్థం చేసుకోవచ్చు.