పవన్ కల్యాణ్ మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. పనులు మాత్రం ఆ స్థాయిలో ఉండవు. ప్రజారాజ్యం యువ నేతగా, జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ వ్యవహారాన్ని పుష్కరకాలం పై నుంచినే గమనిస్తున్నారు తెలుగు ప్రజలు. తన సామర్థ్యం గురించి పవన్ కల్యాణ్ చాలా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ప్రహసనంగా మారడమూ కొత్త కాదు. ఇదే క్రమంలో పవన్ కల్యాణ్ రాజకీయ భవితవ్యం ఇప్పుడు పూర్తిగా మరొకరి చేతిలో చిక్కుబడిపోవడం గమనార్హం. అది మరెవరి చేతిలోనే కాదు.. తన రాజకీయ మిత్రులకు అత్యంత ప్రమాదకారి అయిన చంద్రబాబు నాయుడి చేతిలో! చంద్రబాబు తన రాజకీయ శత్రువుల కన్నా మిత్రులకే ఎక్కువ ప్రమాదకారి. ఇది ఆయన చరిత్ర చెప్పే సత్యం.
చంద్రబాబుతో రాజకీయ వైరాన్ని కలిగి ఉండి, ఆయనతో తలపడి గెలిచిన వారు చాలా మందే ఉన్నారు. అయితే చంద్రబాబు రాజకీయ మైత్రిని కలిగి ఉండి ఎదిగిన వారు మాత్రం చరిత్రలో లేరు! కమ్యూనిస్టు పార్టీలు, భారతీయ జనతా పార్టీ, కేసీఆర్, కాంగ్రెస్.. ఇలా చంద్రబాబుతో దోస్తీ చేసిన వారంతా ఆయా ఎన్నికల్లో చిత్తయ్యారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీజేపీలైతే చంద్రబాబుతో దోస్తీ తర్వాత దుంపనాశనం అయ్యారు తప్ప అంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మరి చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోగలిగే వారు సిసలైన రాజకీయ నేత అవుతారు. పవన్ కల్యాణ్ ను రాజకీయ నేత అనుకోవడం కూడా వేస్టే! అందుకే గొర్రె కసాయి వాడిని నమ్మినట్టుగా పవన్ కల్యాణ్ వెళ్లి చంద్రబాబును నమ్ముతున్నాడు!
అయితే ఇక్కడ పవన్ కల్యాణ్ అతి విశ్వాసమూ ఉండవచ్చు. తను బీజేపీ, కాంగ్రెస్, కేసీఆర్, కమ్యూనిస్టుల కన్నా మేదావిని అనుకోవచ్చు. చంద్రబాబు ఆటలు పవన్ వద్ద సాగవంటూ అభిమానులు కూడా గుడ్డిగా నమ్ముకోవచ్చు. అయితే కాంగ్రెస్, కేసీఆర్, బీజేపీలకు మించిన రాజకీయ చాణక్యం పవన్ కల్యాణ్ కు ఉందనుకోవడం భ్రమ! కాంగ్రెస్, కేసీఆర్, బీజేపీలనే తనతో పొత్తుల సమయంలో దుంప నాశసనం చేసిన చంద్రబాబుకు పవన్ కల్యాణ్ జస్ట్ ఊకలో ఈక!
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేయాలి? ఆయన పార్టీ ఎక్కడ బరిలో దిగాలి? పవన్ కల్యాణ్ ఎక్కడ ఎన్నికల ప్రచారం చేయాలి? ఎక్కడ ప్రచారానికి ఆయన వెళ్లకూడదు? ఎక్కడ ఏమేం మాట్లాడాలి? ఇవన్నీ డిసైడ్ చేయబోయేది చంద్రబాబు నాయుడే! అసలు చంద్రబాబే తనేం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఈ విషయంలో ఆయన మతి స్థిమితాన్నే అనుమానించాల్సి ఉంది. మరి ఈ స్థితిలో ఉన్న చంద్రబాబు స్కెచ్ ల ప్రకారం పవన్ కల్యాణ్ ఇక నడుచుకోవాల్సి ఉంది.
గత ఎన్నికల్లో కూడా పవన్ కల్యాణ్ పొత్తులతోనే వెళ్లాడు. ఒకటికి ఐదారు పార్టీలను కలుపుకుని వెళ్లారు. అయినప్పటికీ జనసేన అధినేత స్వయంగా ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు అది వేరే కథ. అయితే అప్పుడు పవన్ కల్యాణ్ కు తను ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయాలనే స్వేచ్ఛ స్వతంత్రాలు అయినా ఉండినాయి. ఈ మేరకు ఆయన రెండు చోట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రెండు చోట్లా ఓడిపోయారు. అయితే అప్పుడు అలా తన ఇష్టం మేరకు, తను నమ్ముకున్న కుల జనాభా గణనీయంగా ఉన్న రెండు చోట్ల పవన్ కల్యాణ్ పోటీ చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో పవన్ కు ఈ స్వేచ్ఛ కూడా ఉండదు. అంటే రెండు చోట్ల పోటీ చేయడం, అంతా అనుకూలంగా ఉన్న చోట పోటీ చేయడం.. ఇన్ని చాన్సులు పవన్ కు ఉండకపోవచ్చు.
పవన్ చేయగలిగిదంతా.. జస్ట్ చంద్రబాబు చెప్పినట్టుగా నడుచుకోవడం. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేయాలి అనే విషయం కూడా చంద్రబాబే డిసైడ్ చేస్తారు. రెండు చోట్ల పోటీ ఛాన్సే ఉండదు! తెలుగుదేశం వీరాభిమానులు ఈ అంశంపై స్పందిస్తూ.. జనసేన రేంజ్ కు 15 సీట్లు ఎక్కువ అన్నట్టుగా స్పందిస్తున్నారు. బహుశా పవన్ కు తెలుగుదేశం ఇంత కన్నా ఎక్కువ సీట్లు కేటాయించకపోవచ్చు కూడా!
అలా కేటాయించిన సీట్లలో కూడా జనసేనను తెలుగుదేశం పార్టీ గెలవనివ్వదు. జనసేనకు 15 సీట్లు ఇచ్చినా అందులో తెలుగుదేశం రెబల్స్ అంటూ ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలు ఐదారు చోట్ల పోటీ చేస్తారు. అలాగే ఇద్దరు ముగ్గురునేతలకు చంద్రబాబు ఆఖర్లో బీఫారమ్ ఇస్తారు. స్నేహ పూర్వక పోటీ అంటారు! మరో రెండు మూడు నియోజకవర్గాల్లో టీడీపీ వర్గాలు లోపాయి కారీగా పని చేస్తారు. ఇలాంటివన్నీ చంద్రబాబు రొటీన్ వ్యూహాలే. ఈ వ్యూహాలకు పవన్ కల్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు చేతిలో పావు!