రానున్న దసరా నుంచి విశాఖ కేంద్రంగా రోజువారీ కార్యకలాపాలను నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతి స్థానంలో మధ్య కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య సమతుల్యత సాధించడం కోసం వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం చేసింది.ఈ చట్టానికి ఏపీ హైకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం, సుప్రీంకోర్టు తీర్పు దరిదాపుల్లో లేకపోవడంతో రాజధానిపై ముందుకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.
ఎన్నికలు సమీపిస్తున్నవేళ కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా తన పరిధిలోని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్ విశాఖ కేంద్రంగా క్యాంపు కార్యాలయం పేరుతో తన రోజువారీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. అయితే రాజధాని విషయంలో వైసీపీ వేస్తున్న అడుగులు ప్రజాకాంక్షలకు సుదూరంలో ఉన్నాయి.
ప్రజల ఆకాంక్షలతో సంబంధం లేని రాజకీయ నిర్ణయాలు ప్రతికూల పరిస్థితులకు దారి తీయవచ్చు. అధికారంలో ఉన్న పార్టీ తీసుకునే నిర్ణయాలను అమలు చేసేటప్పుడు ప్రజల అభిమతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రతిపక్ష పార్టీల డిమాండ్ల మేరకు అనేక విచారణలకు అంగీకారాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిన మాట “మేము తప్పు చేసామనో లేదా మీకు భయపడో కాదు మేము నిజాయితీగా ఉన్నామని మాకు నమ్మకం ఉన్నా ప్రజలు కూడా అనుకోవాలి”. అందుకే విచారణకు అంగీకరించామని చెప్పేవారు.
కానీ వైఎస్ రాజకీయ వారసుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం “మేము కరెక్ట్ అయినప్పుడు ఎవరు ఏమనుకుంటే మాకేంటి ?” అనే ధోరణితో అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలతో అలా వ్యవహరిస్తే కొంత అర్థం చేసుకోవచ్చు కానీ ప్రజలతో కూడా అట్లే వ్యవహరిస్తే పరిస్థితులు తారు మారు అవుతాయి.
రాజధాని విషయానికి వద్దాం. చారిత్రక ప్రాధాన్యం, వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పరిశీలిస్తే రాజధాని కావాలనే ఆకాంక్ష రాయలసీమలో, అలాగే విజయవాడ కేంద్రంగా మధ్య కోస్తాంధ్ర ప్రజల్లో బలంగా వుంది. అందుకు సహేతుక కారణాలు కూడా లేకపోలేదు. 1953 అక్టోబర్ నుంచి 1956 నవంబర్ 1న తెలంగాణతో కలిపి ఆంద్రప్రదేశ్ గా ఏర్పడే వరకు రాయలసీమలోని కర్నూలు రాజధానిగా ఉంది. 2014 నుంచి నేటి వరకు ఏపీకి అమరావతి రాజధానిగా ఉంది. అలా రెండు ప్రాంతాల్లో రాజధాని అనుబంధం, తత్ఫలితంగా రాజధాని ఆకాంక్ష ఉంది. అదే సమయంలో ఉత్తరాంధ్రలో అనేక కారణాల వల్ల మధ్య కోస్తాంధ్ర, రాయలసీమలో ఉన్నట్లుగా రాజధాని ఆకాంక్ష కనపడటం లేదు.
రాజధాని వస్తే సంతోషించడం మినహా మరో ఆలోచన అక్కడ కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదిత మూడు రాజధానుల చట్టంలో రాజధానిపై మక్కువ లేని విశాఖలో కీలక రాజధాని కార్యాలయం, రాజధాని ఆకాంక్ష ఉన్న రాయలసీమ, మధ్య కోస్తాంధ్రకు హైకోర్టు, అసెంబ్లీ ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనపై రాయలసీమలో పెద్ద మద్దతు లేకపోయినా గత ప్రభుత్వం ఏమి ఇవ్వని కారణంగా హైకోర్టుతో బాటు మరిన్ని కార్యాలయాలు వస్తాయని, ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కీలక అడుగులు పడుతాయని సీమ ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు.
ఉన్న రాజధానిని తీసుకుపోతున్నారన్న కోపం మధ్య కోస్తాంధ్రలో ఉంది. ఈ నేపథ్యంలో రాజధానిపై తదుపరి అడుగులు వేయాలంటే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆటంకం. సుప్రీంకోర్టు తీర్పు దరిదాపుల్లో లేదు. తన పరిధిలోని అవకాశాల మేరకు రాజధాని విషయంలో తాను ఆలోచిస్తున్న మూడు రాజధానులకు బలం చేకూర్చే విధంగా అడుగులు వేయాలన్న ప్రయత్నం వైసీపీ ప్రభుత్వానిది. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వం చేయాల్సింది …రాజధాని ఆకాంక్ష ఏ ప్రాంతంలో ఎలా ఉందో పరిశీలించుకోవాలి. దానికి అనుగుణంగా తన పరిధిలోని అవకాశాలను వినియోగించే నిర్ణయాలు చేయాలి. కానీ ప్రభుత్వ ఆలోచనలు, ప్రయత్నాలు అందుకు భిన్నంగా ప్రజల ఆకాంక్షలకు ఆమడదూరంగా ఉన్నాయి.
విశాఖపై చూపుతున్న శ్రద్ధ రాయలసీమ మీద ఎక్కడ?
ఏ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం అయినా విధాన నిర్ణయాలు అమలు చేసే ముందు ప్రజల ఆశలు ఎలా ఉన్నాయి? అన్న విషయం మీద దృష్టి సారించాలి. రాజధాని విషయంలో కీలక ప్రయోజనం విశాఖకు దక్కుతుంది. మొత్తం ఆలోచనలలో పరిమిత ప్రయోజనం రాయలసీమకు ఉంటుంది. కోర్టు తీర్పు నేపథ్యంలో తన పరిధిలోని అవకాశాలను మూడు రాజధానుల ఆలోచనలకు బలం చేకూర్చే అడుగులు వేయాలంటే రాజధాని ఆకాంక్ష మరియు పరిమిత ప్రయోజనం పొందే రాయలసీమ వైపు మొదట దృష్టి సారించాలి. న్యాయ రాజధాని, న్యాయ స్వభావం కలిగి ఉన్న కార్యాలయాలు కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పి న్యాయ స్వభావం, సహజ న్యాయ సూత్రాలను పరిగణనలోకి తీసుకున్నా KRMB ని కర్నూలులో ఏర్పాటు చేయాలి.
అందుకు భిన్నంగా సంబంధం లేని విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. సీమలో హైకోర్టు ఏర్పాటు సుప్రీంకోర్టు తీర్పు మీద ఆధారపడి ఉంది. తెలుగు అకాడమీ కేటాయించి నేటికీ తిరుపతిలో కార్యక్రమాలు చేపట్టలేదు. అవకాశం ఉన్నవే ఇవ్వని ప్రభుత్వంలో.. మరిన్ని కార్యాలయాలు సీమకు వస్తాయన్న ఆశ అడియాసగా మారింది. అలా రాజధాని ఆకాంక్ష ఉన్న రాయలసీమలో మూడు రాజధానుల ఆలోచనకు మద్దతు నుంచి ప్రభుత్వ వ్యవహార శైలితో అసంతృప్తిగా మారింది. అసంతృప్తిని పట్టించుకోకుండా విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటు విషయంలో పట్టుదలతో ముందుకు వెళితే అసంతృప్తి కాస్త వ్యతిరేకతగా మారే పరిస్థితులను వైసీపీ కోరి తెచ్చుకుంటుంది.
ప్రస్తుతం అమరావతిలో ఉన్న ప్రధాన విభాగాలను విశాఖకు తరలించే ప్రయత్నాలపై మధ్య కోస్తాంధ్రలో ఎలాగూ వ్యతిరేకత ఉంటుంది. ఆకాంక్ష ఉన్న రెండు ప్రాంతాలను విస్మరించి పెద్దగా ఆకాంక్ష లేని విశాఖలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పేరుతో ముందుకు వెళితే అక్కడి ప్రజలు పెద్దగా సంబరపడేది ఏమి ఉంటుంది? మొత్తానికి ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోకుండా విశాఖ కేంద్రంగా పాలనా రాజధాని వైపు వేస్తున్న అడుగులతో ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న వైసీపీ కొత్త సమస్యను కొని తెచ్చుకుంటుంది.