మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వం పడిపోవడం పట్ల చాలా ఆనందంగా రియాక్ట్ అవుతున్నారు… కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి. మహారాష్ట్రలో ఫడ్నవీస్ రెండోసారి ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వం పడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు కుమారస్వామి.
ఈ విషయంలో కుమారస్వామి ఆనందం కేవలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం పడిపోవడమే కాదు, తన ప్రభుత్వం పడిపోవడంలో ఫడ్నవీస్ పాత్ర ఉందని ఈ మాజీ సీఎం భావిస్తున్నారు. అందుకే కుమారస్వామి ఆనంద పడుతున్నారు.
ఈ ఆనందాన్ని ఆయన బాహాటంగానే వ్యక్తం చేశారు. కాంగ్రెస్- జేడీఎస్ కూటమి ప్రభుత్వం పడిపోయిన సమయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఆశ్రయం కల్పించింది దేవేంద్ర ఫడ్నవీస్ అని కుమారస్వామి చెబుతున్నారు. తమ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో భారతీయ జనతా పార్టీ ముంబైలో క్యాంప్ నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.
తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబైలోని ఒక హోటల్లో తలదాచుకోవడం, వారిని కలవడానికి డీకే శివకుమార ప్రయత్నించడం, లోపలకు వెళ్లడానికి పోలీసులు అనుమతించకపోవడం వంటి ఘట్టాలు అప్పుడు చోటు చేసుకున్నాయి. ఈ విషయాలను కుమారస్వామి గుర్తు చేస్తున్నారు. తన ప్రభుత్వం పడిపోవడంలో దేవేంద్ర ఫడ్నవీస్ కుట్ర అలా ఉందని.. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు ఆయన ప్రభుత్వం పడిపోయిందని.. కుమారస్వామి వ్యాఖ్యానించారు.
ఇక కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో కుమారస్వామి ధారాళంగా కన్నీరు కారుస్తున్నారు. తన తనయుడిని లోక్ సభ ఎన్నికల్లో ఓడించడంపై కుమారస్వామి జనాలను నిష్టూరమాడుతున్నారు. ఉప ఎన్నికల్లో అయినా జేడీఎస్ ను గెలిపించాలనే కోరిక ఉంది కుమారస్వామి కన్నీటి ప్రచారంలో.