ఆర్ఆర్ఆర్ ఆల్బమ్ నుంచి నాటు నాటు పాట వీడియో బైట్ బయటకు వచ్చిన దగ్గర నుంచి సీన్ మారిపోయింది. ఎక్కడ విన్నా, ఏ సోషల్ మీడియా చూసినా అదే హడావుడి.
చాలా మంది ఆ పాట కంపోజింగ్ మీద ట్యుటోరియల్స్ కూడా తయారు చేసేసారు. చాలా క్లిష్టమైన కంపోజింగ్. పైగా ఇద్దరు హీరోలు సింక్ కావడం అన్నది కీలకం. దీని మీద ఎన్టీఆర్ ఓ ఇంటర్వూలో చాలా వివరంగా చెప్పుకువచ్చాడు కూడా.
26 మిలియన్ల మంది ఇప్పటికే చూసిన ఈ పాట కోసం కొన్ని గంటల పాటు కష్టపడాల్సి వచ్చిందట. టేకుల మీద టేకులు తీసుకోవాల్సి వచ్చిందట. కాళ్లు చేతులు రిధమిక్ గా కదల్చడం, ఆ స్టెప్స్ అన్నీ ఇద్దరి హీరోల మధ్య సింక్ కావాలి. ఇవన్నీ చూసుకుంటూ పాట ఫినిష్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
తీరా పాట బయటకు వచ్చాక పడ్డ కష్టం అంతా పోయింది అంటూ చెప్పుకు వచ్చారు ఎన్టీఆర్. అంతే కాదు, రాజమౌళి ఎప్పటికీ జనాల అంచనాలకు తగ్గకుండానే సినిమా అందిస్తాడని ధీమాగా చెప్పారు. తను ఈ స్టేజ్ కు వస్తానని ఎప్పుడూ అనుకోలేదని, చేసిన ప్రతి సినిమా ఓ బోనస్ అని అన్నారు.
కొరటాల శివతో చేయబోయే సినిమా రివెంజ్ డ్రామా అని ఎన్టీఆర్ వెల్లడించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2022 నుంచి ప్రారంభం అవుతుందన్నారు. అక్టోబర్ నుంచి కేజిఎఫ్ డైరక్టర్ తో సినిమా స్టార్ట్ అవుతుందన్నారు. ఇది చాలా భారీ రేంజ్ లో వుంటుందన్నారు.