మ‌రిదిని వెన‌కేసుకొచ్చిన పురందేశ్వ‌రికి ర‌ఘునంద‌న్ షాక్!

చంద్ర‌బాబు అరెస్ట్‌ను ఏపీ బీజేపీలోని టీడీపీ అనుకూల నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. బాబు అరెస్ట్ అయిన వెంట‌నే ఏపీ బీజేపీ చీఫ్ హోదాలో పురందేశ్వ‌రి స్పందించారు. చంద్ర‌బాబు అరెస్ట్‌ను ఆమె ఖండించి త‌న బంధుప్రీతిని చాటుకున్నార‌న్న…

చంద్ర‌బాబు అరెస్ట్‌ను ఏపీ బీజేపీలోని టీడీపీ అనుకూల నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. బాబు అరెస్ట్ అయిన వెంట‌నే ఏపీ బీజేపీ చీఫ్ హోదాలో పురందేశ్వ‌రి స్పందించారు. చంద్ర‌బాబు అరెస్ట్‌ను ఆమె ఖండించి త‌న బంధుప్రీతిని చాటుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ కామెంట్స్ పురందేశ్వ‌రికి షాక్ ఇచ్చేలా ఉన్నాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

లాయ‌ర్ కూడా అయిన బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. బాబు అరెస్ట్‌పై స్పందించాల‌ని ఓ చాన‌ల్ ప్ర‌తినిధి ర‌ఘునంద‌న్‌ను ప్ర‌శ్నించారు. ఇందుకు ఆయ‌న స్పందిస్తూ… “ప్ర‌జాస్వామ్య దేశంలో గ‌తంలో కూడా చాలా మంది ముఖ్య‌మంత్రులు, మాజీ ముఖ్య‌మంత్రులు, ప్ర‌ధాన‌మంత్రులు, వారి కుటుంబ స‌భ్యులు అరెస్ట్ అయ్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏం జ‌రిగిందో నాకింకా తెలియ‌దు. కానీ రెండు మూడు నెలల్లో ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ వ‌స్తోంది. ఈ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని అరెస్ట్ చేసే సాహ‌సం పాల‌క ప‌క్షం చేసిందంటే… సాక్ష్యాలు, ఆధారాలు వుంటేనే చేస్తారు. అంతే త‌ప్ప ఎన్నిక‌ల ముందు ప్ర‌తిప‌క్ష నాయకుడిని అరెస్ట్ చేసి, వారికి సానుభూతి వ‌చ్చేలా అరెస్ట్ చేస్తార‌ని నేను అనుకోను”  అని ఆయ‌న అన్నారు.

చంద్ర‌బాబునాయుడు త‌ప్పు చేశార‌ని, అవినీతికి సంబంధించి ఆధారాలు, సాక్ష్యాలు ప‌క‌డ్బందీగా పెట్టుకునే చేశార‌నే అభిప్రాయాన్ని క‌లిగించేలా ర‌ఘునంద‌న్ కామెంట్స్ వున్నాయి. బాబు త‌ప్పు చేసి వుంటార‌నే అభిప్రాయానికి ర‌ఘునంద‌న్ కామెంట్స్ బ‌లం క‌లిగిస్తున్నాయి. 

ఏపీలో మాత్రం బీజేపీలోని కొంద‌రు నాయ‌కులు చంద్ర‌బాబుకు అనుకూలంగా స‌న్నాయి నొక్కులు నొక్కుతుంటే, అలాంటి వారి చెంప చెళ్లుమ‌నేలా ప్ర‌ముఖ న్యాయ‌వాది అయిన ర‌ఘునంద‌న్ కీల‌క కామెంట్స్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ర‌ఘునంద‌న్ కామెంట్స్ వైర‌ల్ కావ‌డంతో పురందేశ్వ‌రి, ఆమె అనుకూల నాయ‌కులు తెగ‌బాధ‌ప‌డిపోతున్నార‌ని స‌మాచారం.