మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన సీఎం జగన్.. దాన్ని సమగ్ర రూపంలో మళ్లీ తెరపైకి తెస్తామని చెప్పారు. అయితే దానికి టైమ్ బౌండ్ మాత్రం ఆయన ప్రకటించలేదు.
వీలైనంత త్వరగా దాన్ని మళ్లీ సభ ముందుకు తెస్తారని అంటున్నాయి వైసీపీ శ్రేణులు. అయితే జగన్ మనసులో మరో ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. 3 రాజధానుల అంశంతో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.
సమగ్ర అభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణ..
అమరావతిపై ద్వేషం లేదని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మొదటి నుంచీ చెబుతున్నారు జగన్. దాన్ని అడ్డుకుంటున్న టీడీపీ అమరావతి అజెండాగా రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్దామా అని అప్పట్లో సవాల్ విసిరింది. దానికి ఇప్పుడు సరైన సమాధానం చెప్పబోతున్నారు జగన్. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ప్రధాన అజెండాగా ప్రజలను తీర్పు అడగడానికి సిద్ధమవుతున్నారట జగన్.
ఇదే నిజమైతే.. ఒకే రాజధాని, అభివృద్ధి అంతా అమరావతిలోనే అనే నినాదంతో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి బరిలో దిగాల్సి ఉంటుంది. సో, ఇక్కడ పిక్చర్ క్లియర్.. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనుకునేవారు వైసీపీకి, ఒకే ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకునేవారు టీడీపీకి మద్దతివ్వాల్సి ఉంటుంది. అంటే అంతిమ విజయం మూడు రాజధానులదే అవుతుంది.
ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు కూడా టీడీపీకి మద్దతివ్వలేదు. అంటే వారు కూడా మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోరుకుంటున్నట్టేననే విషయం తేలింది. సో.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ అజెండాకు తిరుగుండదు.
ప్రజామోదంతో మూడు రాజధానులు..
ఇప్పటికే నవరత్నాలతో జగన్ ఇమేజ్ ఆకాశం అంత ఎత్తుకి ఎదిగింది. ఒకటీ అరా సమస్యలున్నా.. జనం వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ''మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి'' అనేది ప్రధాన అజెండా అయితే మాత్రం వైసీపీకి గతంలో కంటే ఎక్కువ మెజార్టీ రావడం ఖాయం. అప్పుడిక ప్రజామోదంతోనే మూడు రాజధానులు ఏర్పడతాయి. జగన్ కోరుకుంటున్నది కూడా ఇదే.
తాజా సమాచారం ప్రకారం.. వచ్చే ఏడాది ఆగస్ట్ వరకు 3 రాజధానులపై మరో బిల్లు తీసుకొచ్చే ఆలోచన చేయదంట ప్రభుత్వం. ఈలోగా హైకోర్టు, సుప్రీంకోర్టులో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి వస్తారు.
ఆ తర్వాత 3 రాజధానులకు సంబంధించి సమగ్రమైన బిల్లును ప్రవేశపెట్టి.. 2023లో ముందస్తుకు వెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఇలా చేయడం వల్ల అటు లీగల్ గా, ఇటు పొలిటికల్ గా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.