మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అరెస్ట్‌పై ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో కొందరు స్పందించారు. బాబుకు కష్టం వస్తే చాలు ఎన్టీఆర్ కుటుంబమంతా కట్ట కట్టుకుని ముందుకు రావడం తెలిసిందే. అయితే ఒకే ఒక్కడు మాత్రం అసలు స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. ఇది రాజకీయ పరమైన అంశం కావడంతో బాబుకు ఆయన మద్దతు ఇవ్వలేదనే చర్చకు తెరలేచింది.
చంద్రబాబును అరెస్ట్ చేసి 24 గంటలకు పైగా అవుతున్నా… యంగ్ టైగర్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే టాలీవుడ్ యువ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ అసలు స్పందించకపోవడం గమనార్హం. దీంతో టీడీపీ నాయకులు జూనియర్ ఎన్టీఆర్‌పై గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు కష్టాల్లో వుంటే జూనియర్ ఎన్టీఆర్ నుంచి కనీస నైతిక మద్దతు లేకపోవడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
అయితే ఎన్టీఆర్ అభిమానుల అభిప్రాయం మరోలా వుంది. చంద్రబాబుకి రాజకీయ అవసరం ఏర్పడినప్పుడు మాత్రం తమ అభిమాన హీరో గుర్తుకొస్తారని, లేదంటే కరివేపాకులా వాడుకుని పక్కన పడేస్తారని విమర్శిస్తున్నారు. లోకేశ్‌కు రాజకీయంగా అడ్డొస్తాడనే ఉద్దేశంతోనే జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు వ్యూహాత్మకంగా తప్పించారు. నిజానికి టీడీపీ కోసం లోకేశ్ కంటే ఎంతో ముందుగా జూనియర్ ఎన్టీఆర్ 2009లో ఎన్నికల ప్రచారం చేశారు. ఆ సందర్భంలో ఎన్టీఆర్ ప్రమాదానికి కూడా గురయ్యారు.
ఎప్పుడైతే లోకేశ్ టీడీపీలో యాక్టీవ్ అయ్యారో, కొడుకు కోసం తనను పక్కన పెట్టారని జూనియర్ ఎన్టీఆర్ పసిగట్టారు. అప్పటి నుంచి రాజకీయాలకు ఆయన దూరంగా వుంటున్నారు. తన మేనత్త, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై టీడీపీ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలోనూ, అలాగే హెల్త్ యూనివర్సిటీకి తన తాత ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టినపుడు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ తెలివిగా ట్వీట్లు చేశారు. ఆయా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్లు హూందాగా ఉన్నాయి. అంతకు మించి ఆయన రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకోలేదు.
ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్‌ను కూడా తమ హీరో రాజకీయ కోణంలోనే చూస్తున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెబుతుండడం విశేషం.