అప్పుడు నాశనం చేశారు, ఇప్పుడు నటిస్తున్నారు

అమరావతి పేరుతో చంద్రబాబు మరో డ్రామాను రక్తి కట్టించేందుకు సిద్ధమయ్యారు. రైతుల్ని మోసం చేసి పంట భూముల్ని లాగేసుకుంది చాలక, కౌలు పేరుతో వారి నోట్లో మట్టి కొట్టి, కేంద్రం మోచేతి నీళ్లు తాగి,…

అమరావతి పేరుతో చంద్రబాబు మరో డ్రామాను రక్తి కట్టించేందుకు సిద్ధమయ్యారు. రైతుల్ని మోసం చేసి పంట భూముల్ని లాగేసుకుంది చాలక, కౌలు పేరుతో వారి నోట్లో మట్టి కొట్టి, కేంద్రం మోచేతి నీళ్లు తాగి, ఐదేళ్లు కాలక్షేపం చేసిన చంద్రబాబు.. తగుదునమ్మా అంటూ ఇప్పుడు అమరావతిలో పర్యటిస్తారట.

అమరావతి బ్రాండ్ ఇమేజ్ చెడగొడుతున్నారని, అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, విదేశీ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి జగన్ పై నిందలు వేస్తున్న చంద్రబాబు అసలు ఐదేళ్లలో అమరావతిలో చేసిందేంటి? అందుకే మంత్రి బొత్స అది రాజధాని కాదు, శ్మశానంలా ఉంది అన్నారు. ఇప్పుడు ఈ శ్మశానం అనే పదాన్ని తీసుకుని చంద్రబాబు తన పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు.

ఇప్పటికే బొత్స వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. ఇప్పుడు కడప పర్యటనలో ఉన్న చంద్రబాబు అమరావతిలో రేపు పర్యటిస్తానని, అసలక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి చాటి చెబుతానంటూ డప్పుకొడుతున్నారు.

చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తే పరిస్థితి మారిపోతుందా? అసలు ప్రపంచానికి అమరావతికి ఏంటి సంబంధం? ప్రపంచ స్థాయి రాజధాని అంటూ ఊదరగొట్టి, ఇటుకల పేరుతో విరాళాలు కొల్లగొట్టి, రాజధానికి భూములిచ్చిన రైతులతో పాటు, రాష్ట్ర ప్రజలందర్నీ మోసం చేశారు బాబు. ఇప్పుడీ అవకతవకలన్నీ జగన్ బైటపెడుతుంటే ఏం చేయాలో పాలుపోక ఇలా ఎదురుతిరుగుతున్నారు. నాశనం చేస్తున్నారంటూ నాటకాలాడుతున్నారు. 

వాస్తవంగా ఆలోచిస్తే, రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఇప్పుడు అంతర్జాతీయ రాజధాని కాదు, ఉపాధి. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయేలా గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సీఎం జగన్ ఒక్కొక్కటీ సరిచేస్తున్నారు. ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన యువతకు ఉపాధి కల్పించారు. అవినీతి లేని సమాజాన్ని సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగానే రాజధానిపై తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదు. రాజధాని కంటే రైతులే ముఖ్యం అనుకున్నారు కాబట్టే.. రాజధాని నిర్మాణాల కంటే ముందు పోలవరం నిర్మాణానికే జగన్ ప్రాధాన్యమిస్తున్నారు.

రాజధాని రైతులకు కౌలు చెల్లిస్తూనే.. నిర్మాణాల విషయంలో కూడా ఆటంకాలు లేకుండా చూస్తున్నారు. రాజధాని అనేది రాత్రికి రాత్రే అభివృద్ధి చెందే అంశం కాదు, కాలక్రమంలో జరగాల్సిన అభివృద్ధి. దానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ విధి. జగన్ ఈ దిశగానే ముందడుగు వేస్తున్నారు. గ్రాఫిక్స్ రాజధాని కంటే జనం నివసించే రాజధానిపైనే ఆయన దృష్టిపెట్టారు. చంద్రబాబుకు మాత్రం ఇవన్నీ అనవసరం, ఆయన రాజకీయం ఆయనది.