తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు వారసత్వం తీసుకోవాలని ఉబలాటపడుతున్న నారా లోకేష్ వంటి నాయకుడు పాదయాత్ర చేస్తున్నారంటే.. ప్రజలు ఏం ఆశిస్తారు? ప్రభుత్వానికి సంధించగల ప్రశ్నలు వారి మదిలో మెదలుతాయా? ఈ యువనాయకుడు కొత్తగా మనకు ఏం చేయబోతాడు? అనే ఆలోచన మెదలుతుందా? నారా లోకేష్ కు ఈ ఆలోచన ఉన్నట్టుగా లేదు. ఈయన పాదయాత్ర ప్రారంభించారు గానీ.. జగన్ ను ప్రశ్నించడమే తప్ప తాను ఏం చేయాలనుకుంటున్నారో చెప్పలేకపోతున్నారు. లేదా చెప్పడానికి భయపడుతున్నారేమో తెలియదు.
నారా లోకేష్ పాదయాత్రలో ప్రస్తావించిన కొన్ని విషయాలను గమనిద్దాం. ఒకటి- 45 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు పెన్షను ఇస్తానని ప్రకటించిన హామీ ఏమైంది. రెండు- మద్యం వ్యాపారం, తయారీ, అమ్మకం విభాగాల్లో జగన్ బినామీలే ఉన్నారు.. మద్య నిషేధం హామీ అమలు కావడం లేదు. మహిళల తాళిబొట్లను జగన్ తాకట్టు పెట్టారు. మూడు-అమ్మఒడి లబ్ధి అందించే విషయంలో రకరకాల ఆంక్షలతో లబ్ధిదారుల సంఖ్యను దారుణంగా తగ్గించారు.
ఈ మూడు అంశాల గురించి కాస్త లోకేష్ విచక్షణ ఎలా ఉన్నదో చర్చిద్దాం.
ఒకటి- వృద్ధులందరికీ పెంచిన పెన్షన్లే అమలు చేస్తున్నారు. మహిళలకు మేనిఫెస్టోలోగానీ, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల రూపంలో గానీ లేని అనేక పథకాలను జగన్ అమలు చేస్తున్నారు. టైలరింగ్ చేసుకునే వారికి, ఇతర వృత్తుల వారికి అనేక పథకాల రూపంలో ఆర్థిక సాయం అందజేస్తున్నారు. 45 దాటిన ప్రతి మహిళను వృద్ధులుగా పరిగణించడం లాగా కాకుండా.. దాదాపుగా ఆ వయోపరిమితికి చెందిన ప్రతిమహిళకు ఏదో ఒక లబ్ధి చేకూరేలా పథకాలు అమలవుతున్నాయి. ఈ విషయం గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. లోకేష్ ఈ ప్రశ్న సంధించి ఊరుకుంటే కుదరదు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 45 దాటిన ప్రతి మహిళకు పెన్షను ఇస్తామని ప్రకటించే ధైర్యం ఉందా? అది సాధ్యమేనా ఆలోచించాలి. అలా వరం ఇవ్వగల ధైర్యం ఉంటేనే ఈ ప్రశ్న వేయాలి.
రెండు- మద్యనిషేధం సంగతి చూద్దాం. మద్యం వ్యాపారంలో జగన్ బినామీలు ఉన్నారా? లేదా? అమ్మిన ప్రతిరూపాయినీ జగన్ తినేస్తున్నాడు ఇలాంటి నిరాధార పసలేని ఆరోపణలు కాదు. చేతనైతే సాక్ష్యాలతో విమర్శలు చేయాలి. జగన్ సర్కారు వచ్చిన తర్వాత.. ఇదివరకటి కంటె మద్యం దుకాణాల సంఖ్య తగ్గిందా లేదా? ఆ సంగతి మాట్లాడాలి. ఇప్పుడు మద్యం ఆదాయం పెరిగిందనే కాకుల లెక్క చెప్పడం కాదు. ధరలు పెరిగాయి గనుక ఆదాయం పెరుగుతుంది. అలాకాకుండా దుకాణాలు తగ్గాయాలేదా చూస్తే.. నిషేదం దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందా లేదా తెలుస్తుంది. పోనీ , లోకేష్ తమ సర్కారులో పూర్తి మద్య నిషేధం చేస్తామని చెప్పగలరా? తాము అధికారంలోకి వస్తే ఎప్పటిలోగా నిషేధిస్తామో.. మద్యం నియంత్రణ దిశగా ఏం చర్యలు ఎప్పటిలోగా తీసుకుంటామో స్పష్టంగా చెప్పగలరా? అంత చేవ ఉందా?
మూడు- అమ్మఒడి సంగతి. లబ్ధిదారుల్లో సంపన్న వర్గాలను గుర్తించి వారికి ఆపేస్తే అది తప్పు అనిపించుకుంటుందా? ఏ ప్రభుత్వమైనా పథకాలను పేదలకోసం అమలు చేస్తాయి గానీ.. ధనికుల కోసం కాదు కదా. పోనీ జగన్ మోసం చేస్తున్నాడని అనుకుంటే.. తాము అధికారంలోకి వస్తే.. బడిలో చదివే ప్రతి పిల్లవాడి తల్లికీ ఎలాంటి ఆంక్షలు , నిబందనలు లేకుండా సొమ్ములిస్తాం అని లోకేష్ చెప్పగలరా? అలా చేతనైతేనే ఈ ప్రశ్న వేయాలి.
లోకేష్ మాటలు విన్న ప్రజలకు ఈ సందేహాలు కలుగుతున్నాయి. ముందు ఆయనకు స్పష్టత ఉంటే.. ఆ తర్వాతే ప్రశ్నలు వేయాలి. లేకపోతే ఈ మాటలు, ఈ యాత్ర అంతా వృథా అనే సంగతి లోకేష్ గ్రహించాలి.