హలో.. హలో.. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్

మేము తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీకు సీటు కన్ఫామ్ అయింది. ఈ మాటవింటే ఎవరైనా అది నిజం కాదు అబద్ధం అని ఎందుకు అనుకుంటారు. అలాగే అమాయక ప్రజలు…

మేము తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీకు సీటు కన్ఫామ్ అయింది. ఈ మాటవింటే ఎవరైనా అది నిజం కాదు అబద్ధం అని ఎందుకు అనుకుంటారు. అలాగే అమాయక ప్రజలు కూడా నమ్మారు. చివరకు ఆ కాల్ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చింది కాదని, పక్కనే ఉన్న మోసగాడి ఆఫీస్ నుంచి వచ్చిందని తెలుసుకుని లబోదిబోమన్నారు. అప్పటికే లక్షలు లక్షలు ఆ మోసగాడికి చెల్లించిన బాధితులు పోలీస్ కేసు పెట్టినా ఫలితం లేకపోవడం విశేషం. ఈ ఘరానా మోసం హైదరాబాద్ లో జరిగింది.

కిలాడి.. కిలేడి..

పేరుగొప్ప కాలేజీల్లో ఇంజినీరింగ్ సీట్లు, మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడేవారు శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డి. గ్రోవెల్ ఎడ్యుకేషనల్ కెరియర్ సర్వీసెస్ పేరుతో కాచిగూడలో ఓ ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసి వీరిద్దరూ మోసాలకు తెరతీశారు. అమాయకుల్ని మోసం చేయడంలో భర్తకు చేదోడువాదోడుగా ఉండేది సంధ్యారెడ్డి. తియ్యగా మాట్లాడుతూ కస్టమర్లను బుట్టలో దింపేది.

తన భర్తకు సీఎం క్యాంప్ ఆఫీస్ లో పరిచయాలున్నాయంటూ గొప్పలు చెప్పేది. ఆ పరిచయాలతోనే సీట్లు ఇప్పిస్తామని నమ్మబలికేది. అంతే కాదు, సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో ఫోన్లు చేయించే బాధ్యత కూడా సంధ్యారెడ్డిదే.

ఇక బిల్డప్ బాబాయ్ శ్రీధర్ రెడ్డి.. ఓ రేంజ్ లో అందర్నీ హడలగొట్టేవాడు. తనకు సీఎం ఆఫీస్ లో అందరూ పరిచయమని చెప్పుకునేవాడు. కారు దిగిన దగ్గర్నుంచి తిరిగి కారెక్కే వరకు అతని బిల్డప్ చూస్తే నిజంగా సీఎం క్లోజ్ ఫ్రెండ్ అనుకునేంతలా ఉండేది అతగాడి ఆర్భాటం. అలా ఇద్దరూ కలిసి జనం సొమ్ము 20కోట్లకు పైనే కాజేశారని టాక్.

ఇంజినీరింగ్ సీట్ కు 10నుంచి 15 లక్షలు, మెడికల్ సీటుకి 50 లక్షల రూపాయలు వసూలు చేసేవారని తెలిసింది. బిడ్డల కాలేజీ సీటు కోసం డబ్బు కట్టి మోసపోయిన తల్లిదండ్రులు తమ డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేసినా ఆ కిలాడీ దంపతులు లైట్ తీసుకునేవారు. 5 నెలలుగా వారి చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడిన కొంతమంది ఇటీవల పోలీసులను ఆశ్రయించారు, అయినా ఫలితం లేదు.

సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే వారిపై 3 ఎఫ్ఐఆర్ లు ఉండటం గమనార్హం. అయితే ఇప్పటివరకూ వారిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. కళ్లముందు కనపడుతున్నా వారిని విడిచిపెడుతున్నారని, పోలీసుల్ని కూడా వారు మేనేజ్ చేసి ఉంటారని వాపోతున్నారు బాధితులు. ఇదీ హైదరాబాద్ లో జరిగిన 'సీఎం క్యాంప్ ఆఫీస్' మోసం.