పవన్ కు పలు ప్రశ్నలు

పబ్లిక్ లో ఏమైనా అంటాం అంటారు కవి శ్రీశ్రీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పబ్లిక్ ఫిగర్. ప్రజ‌లకు సేవ చేస్తా.. జ‌గన్ నుంచి రక్షిస్తా అంటారు. కానీ కోట్ల ప్రజ‌ల సంగతి దేవుడెరుగు.…

పబ్లిక్ లో ఏమైనా అంటాం అంటారు కవి శ్రీశ్రీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పబ్లిక్ ఫిగర్. ప్రజ‌లకు సేవ చేస్తా.. జ‌గన్ నుంచి రక్షిస్తా అంటారు. కానీ కోట్ల ప్రజ‌ల సంగతి దేవుడెరుగు. అరడజ‌ను మంది నిర్మాతల సంగతి ముందు చూడాల్సి వుంది పవన్ కళ్యాణ్. తన వైఖరి కారణంగా పలువురు నిర్మాతలు, దర్శకులు ఎంత ఇబ్బంది పడుతున్నారో పవన్ కు తెలియదా? అందుకే ఈ పలు ప్రశ్నలు.

1. మైత్రీ సంస్థ దగ్గర తీసుకున్న భారీ అడ్వాన్స్ ఎంత? ఎన్నాళ్లు అయింది? దానికి వడ్డీ లెక్క కడితే ఎంత అవుతుంది? ఇదంతా వారికి నష్టం కాదా?

2. పవన్ కారణంగా అలా పడిగాపులు పడుతున్న దర్శకుడు హరీష్ శంకర్ కనుక ఈ గ్యాప్ లో సినిమాలు చేసి వుంటే ఎన్ని కోట్లు సంపాదించి వుంటారు. ఇప్పుడు అవన్నీ పోగొట్టుకున్నట్లు కాదా? కేవలం పవన్ క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల కదా ఇదంతా?

3. పవన్ చకచకా సినిమా చేయకపోవడం వల్ల హరి హరి వీరమల్లు నిర్మాత ఏఎమ్ రత్నం కు వస్తున్న నష్టం ఎంత? దర్శకుడు క్రిష్ కు నష్టం ఎంత?

4. పీపుల్స్ మీడియా సముఖ ఖని సినిమా కోసం హీరో సాయి ధరమ్ తేజ్ ను అలా వెయిటింగ్ లో ఎన్నాళ్లు వుంచేసారు. దాని వల్ల మిగిలిన నిర్మాతలకు, దర్శకులకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం కాదా?

5. అదే సినిమా కోసం తన సినిమాలు అన్నీ క్యాన్సిల్ చేసుకుని సముద్రఖని అలా వెయిటింగ్ లో వుండిపోయిన సంగతి వాస్తవం కాదా?

6. పెద్ద హీరోలు అందరూ ఓ సినిమా పూర్తి చేసి మరో సినిమా మీదకు వెళ్తారు. కానీ పవన్ అన్ని సినిమాలు అలా అలా కొంచెం కొంచెం చేయడం వల్ల ఏదీ పూర్తి కాకుండా అలా వుండిపోతున్నాయన్నది వాస్తవం కాదా?

ఇల్లు చక్కదిద్దుకుని తరువాత వేరే పనులు చూడాలి. తన వల్ల ఇబ్బంది పడుతున్న, నష్టపోతున్న నిర్మాతలు, దర్శకుల సంగతి పవన్ గమనించాలి. చకచకా సినిమాలు పూర్తి చేసి వారిని కాపాడాలి. లేదూ అంటే హరీశ్ శంకర్ మాదిరిగా ఇరవై ముఫై కోట్లు నష్టపోవాల్సి వుంటుంది అందరూ. ఎందుకంటే పవన్ త్వరగా వదిలితే వేరే సినిమాలు చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు కదా? వారికి అలాంటి అవకాశం ఇవ్వకుండా పవన్ తాళం వేసి పెడుతున్నారు. వారు ఏమీ అనలేక కిందా మీదా అవుతున్నారు.