అవినీతి కేసులో చంద్రబాబునాయుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్‌ను నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. జనసేనాని పవన్‌కల్యాణ్, చంద్రబాబు వదిన దగ్గుబాటి పురందేశ్వరి తదితర తోటి ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ కావాల్సిన నాయకుడు కానే కాదని ఇతర పార్టీల నాయకులు కూడా బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబుకు వీరాభిమానులైన ఇద్దరు నాయకులకు మాత్రం కనీసం చీమ కుట్టినట్టైనా లేదేం అనే చర్చకు తెరలేచింది. ఆ ఇద్దరు నాయకులు… టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, అదే పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. చంద్రబాబు అంటే వీళ్లిద్దరికి విపరీతమైన ప్రేమాభిమానాలు. తమ ఇళ్లలో ఇంకా చంద్రబాబునాయుడి ఫొటోనే పెట్టుకున్నారనే ప్రచారం లేకపోలేదు.
చంద్రబాబునాయుడి అరెస్ట్‌ను తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు కొండా మురళీధర్‌రావు ఖండించారు. ఈయన వైఎస్సార్‌కు వీరాభిమాని. కానీ వైఎస్ జగన్‌తో రాజకీయంగా విభేదించి వైసీపీని వీడి బీఆర్ఎస్‌లోకి కొండా దంపతులు వెళ్లారు. అక్కడి నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు.
వైఎస్సార్ అభిమానులుగా గుర్తింపు పొందిన కొండా మురళీనే చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించి, ఏపీలో చీకటి రోజు అని అభివర్ణించాడు. అలాంటిది రేవంత్‌రెడ్డి, సీతక్క నోరు మెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందనే చర్చకు తెరలేచింది. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి ఈ ఇద్దరు నేతలు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ వీరిని చంద్రబాబు మనుషులుగానే తెలంగాణ సమాజంతో పాటు కాంగ్రెస్ నాయకులు గుర్తిస్తారు.