మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భయపడ్డారా? అంటే..ఔనని ఆయన వ్యవహారశైలి చెబుతోంది. సహజంగా చంద్రబాబు ఎదుటి వాళ్లను దబాయిస్తూ మాట్లాడ్డం అనేక సందర్భాల్లో చూశాం. కానీ ఇవాళ తెల్లవారుజామున నంద్యాలలో తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడిన తీరు గమనిస్తే ఆత్మరక్షణలో పడినట్టు కనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నంద్యాలలో చంద్రబాబునాయుడు ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద బస్సులో బస చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో రూ.370 కోట్లకు పైబడి చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీస్ ఉన్నతాధికారులు వెళ్లారు. బస కేంద్రం వద్దకు డీఐజీ రఘురామిరెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డి వెళ్లి అరెస్ట్ చేసేందుకు వచ్చామని వివరించారు. వారితో చంద్రబాబు ఎలాంటి వాదనకు దిగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది చంద్రబాబు సహజ శైలికి విరుద్ధమని చెబుతున్నారు.
తనపై నేరారోపణ ఏంటో చెప్పాలని డీఐజీ రఘురామిరెడ్డిని చంద్రబాబు వేడుకోవడం గమనార్హం. డీఐజీ, ఎస్పీలతో చంద్రబాబు కంటే ఎక్కువగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు చర్చించడాన్ని వీడియోల్లో చూడొచ్చు. చంద్రబాబునాయుడు కుర్చీలో కూర్చుని ఉండడంతో, ఆయన అసలు అక్కడ ఉన్నారా? లేదా? అనే అనుమానం కలిగింది. కాలవ శ్రీనివాసులు చాలా మర్యాదగా పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడ్డం, అందుకు వారు అదే రీతిలో సమాధానాలు ఇచ్చారు.
సహజంగా చంద్రబాబు పోలీస్ అధికారులపై విరుచుకుపడుతుంటారు. తనపై చేయి వస్తే అంతు చూస్తానని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని , తన జోలికి వస్తే చట్టపరంగా శిక్షిస్తానని బెదిరిస్తూ వుంటారు. కానీ అలాంటివేవీ ఆయన చేయకపోవడం టీడీపీ నాయకులు, కార్యకర్తల్ని సైతం ఆశ్చర్యపరిచింది.
చంద్రబాబునాయుడిని అరెస్ట్ తీసుకెళ్లే సందర్భంలో ఆయన ముఖంలో నెత్తురు చుక్కలేదు. తనను ఏమీ చేయలేరని ఆయన ఇంత కాలం అనుకున్నారు. అందుకు విరుద్ధంగా అరెస్ట్ చేయడంతో పీడ కల కంటున్నట్టుగా ఆయన పరిస్థితి తయారైంది. అరెస్ట్ అని చెప్పగానే ఆయనలో భయాందోళన కనిపించింది. షాక్‌లో ఆయన ఏమీ మాట్లాడలేకపోయారేమో అని టీడీపీ నేతలు అంటున్నారు.