ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ కలిశారు. వీరి కలయిక అందరి దృష్టిని ఆకర్షించింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకున్న నేపథ్యంలో పాలకుల మధ్య మాటలు కరువయ్యాయి. దీంతో కేసీఆర్, జగన్ మధ్య సంబంధాలపై రకరకాల ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరి కలయికకు హైదరాబాద్‌లోని శంషాబాద్ కొత్తగూడలోని వీఎన్ఆర్ ఫామ్స్‌లో కళ్యాణ మండపం వేదికైంది.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలు స్నిగ్ధారెడ్డికి, ఏపీ సీఎం జగన్ ప్రత్యేకాధికారి కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌రెడ్డితో వివాహం జరిగింది. ఈ వివాహానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు మంత్రులు, ఎమ్మె ల్యేలు హాజరయ్యారు. వైఎస్ జగన్ తల్లి విజయమ్మ కూడా పాల్గొన్నారు.
ఇదిలా వుండగా కేసీఆర్, జగన్ పక్కపక్కనే కూర్చుని నవ్వుతూ ముచ్చట్లు చెప్పుకోవడం ఆసక్తి పరిణామంగా భావించొచ్చు. ఎందుకంటే జల వివాదం నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పాలకుల మధ్య వ్యవహారం ఉప్పునిప్పులా ఉందనే చర్చ సాగుతూ వచ్చింది.
కేంద్రజలశక్తి మంత్రి నేతృత్వంలో కొంత కాలం క్రితం జరిగిన చర్చలో కేసీఆర్, జగన్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్టు వార్తలొచ్చాయి. తమ రాష్ట్ర జల ప్రయోజనాల విషయంలో ఎవరూ తగ్గకపోవడంతో సమస్య జఠిలమైన సంగతి తెలిసిందే.
ఇటీవల తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర అధికారుల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి తాను హాజరవుతానని కేసీఆర్ ప్రకటించి, చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాజాగా సీఎంలిద్దరూ పరస్పరం ఆప్యాయంగా పలకరించుకోవడంతో పాటు ముచ్చట్లు చెప్పుకోవడంపై కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.