మారింది లోకేషా…అచ్చెన్నా…?

సరిగ్గా రెండేళ్ల క్రితం తిరుపతిలో ఒక హొటల్ లో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ హోదాలో అచ్చెన్నాయుడు లోకేష్ పని తీరు మీద తేలిక చేసి మాట్లాడినట్లుగా ఒక వీడియో బైట్ తెగ వైరల్ అయింది.…

సరిగ్గా రెండేళ్ల క్రితం తిరుపతిలో ఒక హొటల్ లో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ హోదాలో అచ్చెన్నాయుడు లోకేష్ పని తీరు మీద తేలిక చేసి మాట్లాడినట్లుగా ఒక వీడియో బైట్ తెగ వైరల్ అయింది. ఆయనే బాగుంటే అంటూ తెలుగుదేశం భవిష్యత్తు మీద అచ్చెన్నాయుడు నిర్వేదం వ్యక్తం చేసినట్లుగా ఆ వీడియో బైట్ లో ఉంది. అలా తాను అనలేదని తరువాత అచ్చెన్నాయుడు ఖండించినా పార్టీ లేదు బొక్కా లేదు అన్న ఆయన క్యాచీ డైలాగ్ ఈ రోజుకీ పాపులరే.

అలాంటి అచ్చెన్నాయుడుకు రెండేళ్ల కాల వ్యవధిలో చినబాబు గా ఉన్న లోకేష్ పెదబాబు చంద్రబాబునే మించేసే స్థాయి పెర్ఫార్మెన్స్ ఏమి కనిపించింది అన్నది వైసీపీ విమర్శ. పాదయాత్ర తొలి రోజు సభ కుప్పంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ లోకేష్ అద్భుతమైన నాయకుడు అని కీర్తించారు. ఆయన మంత్రిగా రెండేళ్ళ పాలన ఏపీకి కొత్త దారి చూపించిందని కొత్త మాటలే చెప్పారు.

ఇప్పటిదాకా మంత్రిగా లోకేష్ పెర్ఫార్మెన్స్ గురించి ఆయనతో సహా ఎవరూ చెప్పుకోలేదు. కానీ అచ్చెన్నాయుడు మాత్రం మినిస్టర్ అంటే లోకేషే సుమా అంటున్నారు. యువ నాయకుడు లోకేష్ అని ఏపీకి సరైన నాయకుడు అని తెగ పొగిడారు. లోకేష్ వారసత్వంతో రాజకీయాల్లోకి రాలేదని అచ్చెన్నాయుడు చెబుతున్నారంటేనే చినబాబుని ఏ రేంజిలో ఎత్తాలనుకుంటున్నారో అర్ధం అవుతోంది అంటున్నారు.

చంద్రబాబు మెత్తగా ఉంటారు, మంచిగా ఉంటారు. పార్టీ అధికారంలో ఉంటే క్యాడర్ ని వదిలేసి అధికారుల వెంట పడతారు అని ఈ విషయం బాబు బాధ పడినా తాను చెబుతను అని అచ్చెన్న పెదబాబు మీదనే సుతిమెత్తని విమర్శలు చేస్తూ లోకేష్ మాత్రం అలాంటి వారు కాదని బాబుని మించిన నేతగా చూపించేశారు. బాబు కంటే కూడా చినబాబు కార్యకర్తలకు ఎక్కువ న్యాయం చేస్తారు అని అచ్చెన్నాయుడు అనడం ద్వారా తెలుగుదేశం సర్వం లోకేష్ మయం అని స్పష్టం చేశారు.

గత రెండున్నరేళ్లలో లోకేష్ లో ఏమి మార్పు చూశారో అచ్చెన్న ఆయనను చంద్రబాబుని మించిన నేతగా కీర్తిస్తున్నారు అని వైసీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి. లోకేష్ ఏపీకి సరైన నాయకుడు అంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే తెలుగుదేశంలో లోకేష్ స్థాయి మాత్రం ఈ రెండేళ్లలో బాగా పెరిగింది. అది అచ్చెన్నాయుడు సహా అందరికీ అర్ధం అయింది. అందుకే ఈ మార్పు అచ్చెన్న సహా అందరిలోనూ వచ్చింది అని అంటున్నారు.