ఒక పక్క సినిమా నిర్మాణ వ్యయాలు పెరుగుతున్నాయ్. మరో పక్క హీరోల రెమ్యూనిరేషన్లు పెరుగుతున్నాయి. కానీ వాటితో పాటే సినిమాల మార్కెట్ కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల విడుదలయిన సినిమాలు కావచ్చు..విడుదల కాబోతున్న సినిమాలు కావచ్చు..రెడీ అవుతున్నవి కావచ్చు, రేట్లు వింటుంటే, ఇదే భావన కలుగుతోంది.
చిన్న సినిమాలు మార్కెట్ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నాయి కానీ, పెద్ద సంస్థలు చేసే చిన్న సినిమాలకు కావచ్చు. పెద్ద సినిమాలకు కావచ్చు. ఆ ఇబ్బంది కనిపించడం లేదు. మంచి రేట్లే వస్తున్నాయి కూడా.
సందీప్ కిషన్ మైకేల్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు 6.30 కోట్లకు సింగిల్ పాయింట్ లో విక్రయించేసారు. కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాను ఇదే విధంగా తొమ్మిది కోట్లకు విక్రయించేసారు. సంక్రాంతికి బాలయ్య సినిమా వచ్చింది. ఆంధ్ర 35 కోట్ల మేరకు విక్రయించారు. బాలయ్య సినిమా రేట్లు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. నాన్ థియేటర్ మీద ఈ సినిమాకు 63 కోట్ల వరకు వచ్చింది.
రాబోయే సినిమాల రేట్లు కూడా భారీగానే వినిపిస్తున్నాయి. మహేష్ బాబు సినిమా తెలుగు రాష్ట్రాలకే 120 కోట్ల వరకు వుంటుందని వినిపిస్తోంది. డిజె టిల్లు 2 సినిమా నైజాం హక్కులే తొమ్మిది కోట్లు కోట్ చేస్తున్నారు. పుష్ప 2 రేంజ్ ఎంత వుంటుంది అన్నది ఇప్పటికి ఇంకా డిసైడ్ కాలేదు. అది కూడా చాలా భారీగా వుండే అవకాశం క్లియర్ గా వుంది.
ఇటీవల థియేటర్లకు మళ్లీ జనాలు బాగానే వస్తున్నారు. ఇది చూసి ఎగ్జిబిటర్లకు, బయ్యర్లకు ధైర్యం వస్తోంది. అందుకే మళ్లీ సినిమా థియేటర్ల రెంట్లు పెరుగుతున్నాయి. వాటితో పాటే బయ్యింగ్ రేట్లు కూడా పెరుగుతున్నాయి.