ఈ మధ్యనే వచ్చింది బాలయ్య నటించిన అఖండ ట్రయిలర్. ఇంచి ముక్క కూడా దొరకదు నా కొడకా..ఇలాంటి భీకరమైన డైలాగులతో. ఈ సినిమానే కాదు, బాలయ్య సినిమాలు అన్నింటిలో ఇలాంటి లేస్తే మనిషిని కాదు లాంటి డైలాగులు అనేకం వుంటాయి. కానీ వాస్తవ జీవితంలో అలా రౌద్రంగా వుండక్కరలేదు. కానీ కాస్తయినా ఆవేశం వుండాలి.
వల్లభనేని వంశీ అనే ఎమ్మెల్యే కొన్ని రోజుల క్రితం తన అల్లుడు, మేనల్లుడు లోకేష్ ను ఉద్దేశించి దారుణమైన కామెంట్లు చేసారు. నిజంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన కామెంట్లు అవి. ఆ వెంటనే బాలయ్య బయల్దేరి విజయవాడ వచ్చి, అభిమానులకు ఒక్క పిలుపు ఇచ్చి, వంశీ ఇంటి ముందు ధర్నా లాంటిది చేసి వుంటే…ఆ విధంగా తన సోదరిపై వేసిన అభాండాలను ఖండించి వుంటే…కచ్చితంగా హీరో అయ్యేవాడు. నాయకుడు అనిపించుకునేవాడు. అలా చేయలేదు.
సరే, అవే పిచ్చి మాటలను అసెంబ్లీలో కొందరు ప్రస్తావించారు. బావ చంద్రబాబు కంట తడి పెట్టారు. ఇప్పుడు అయినా బాలయ్య స్పందించారా? లేదు. కాసుక్కోండి నేను వస్తున్నా విజయవాడ నడిబొడ్డుకు. చూసుకుందాం. మీ ప్రతాపమో, నా ప్రతాపమో అని ఓ డైలాగు విసిరినా, అభిమానులారా. రండి మా సోదరిపై పిచ్చి కామెంట్లు చేసిన వాళ్ల ఇళ్ల ముందు నిరసన తెలుపుదాం అని అని వుంటే.
ఆఫ్ కోర్స్ పోలీసులు ఎయిర్ పోర్ట్ లోనే ఆపేయచ్చు. లేదా హవుస్ అరెస్ట్ చేయచ్చు. కానీ తెలుగుదేశం శ్రేణులు బాలయ్య ఓ భవిష్యత్ నాయకుడిని దర్శిస్తాయి. మనకూ ఒక యాంగ్రీ లీడర్ వున్నాడని సంబరపడతాయి. ఆ విధంగా బాలయ్య రాజకీయాల్లో కూడా హీరో అవుతారు. కానీ ఎందుకనో అస్సలు మాట్లాడడం లేదు. అఖండ టికెట్ ల ఇస్యూ ఏమైనా దీని వెనుక వుందా? ఏమో?