విశాఖ ఉక్కు గురించి మంచి మాట చెప్పరాదా..?

అలుగుటయే ఎరుగని అజాత శతృవు అంటూ ధర్మరాజు గురించి పద్యం చెబుతారు. మోడీ గురించి చెప్పాలంటే తగ్గుటయే ఎరగని మహా నేతగానే అంటారు. మోడీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది శిలా శాసనమే. అలాంటి…

అలుగుటయే ఎరుగని అజాత శతృవు అంటూ ధర్మరాజు గురించి పద్యం చెబుతారు. మోడీ గురించి చెప్పాలంటే తగ్గుటయే ఎరగని మహా నేతగానే అంటారు. మోడీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది శిలా శాసనమే. అలాంటి మోడీ సాగు చట్టాల మీద వెనక్కి తగ్గారు. ఆవి రద్దు చేస్తున్నట్లుగా కూడా పేర్కొన్నారు.

దాంతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. మరి అదే నోటితో మరో మంచి మాట చెప్పరాదా మోడీ సార్ అంటున్నారు విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నేతలు. విశాఖ ఉక్కు పోరాటం కూడా పది నెలలుగా అలుపెరగని తీరున సాగుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి సాధించుకున్న కర్మాగారం ఇది.

అలాంటి విశాఖ ఉక్కు విషయంలో కూడా మోడీ చక్కని మాట చెబితే బలి పీఠం మీద ఉన్న ఫ్యాక్టరీ బంగారమే అవుతుంది అంటున్నారు. ఏకంగా 31 మంది ప్రజలు అమరులై వారి త్యాగాల పునాదుల మీద పుట్టిన ఉక్కు కర్మాగారం విషయంలో మోడీ భరోసా ఇస్తే చాలు విశాఖ స్టీల్ కి అంతా మంచే జరుగుతుంది అని కూడా చెబుతున్నారు.

విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడం అన్న నిర్ణయం జరిగిపోయిందని, మోడీ ఒకసారి డెసిషన్ తీసుకుంటే వెనక్కి వెళ్ళరు అని ఇంతకాలం అంతా భావించారు, కానీ ప్రజల ఆకాంక్షలకు పోరాటాలకు మోడీ ఎంతగానో విలువ ఇస్తున్న నేపధ్యంలో విశాఖ ఏం పాపం చేసింది అంటోంది ఉక్కు కార్మిక లోకం. 

మరి ఇవాళ రైతులకు చక్కని కబురు చెప్పిన మోడీ రేపు ఉక్కు విషయంలో కూడా బహు తీయని మాటని చెప్పి అందరికీ ఊరట కలిగిస్తారు అని ఆశగా ఎదురుచూస్తున్నారు.