చంద్రబాబుది దొంగ ఏడుపు అనడం మహాపాపం

చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్చారు. మీడియా ముఖంగా దేశమంతా చూశారు. తనని ఎన్ని బూతులు తిట్టినా పడ్డానని, కానీ తన భార్యని అవమానించినందుకు తట్టుకోలేకపోతున్నానని ఏడ్చారు. ఆయన ఇలా ఏడవడం గతంలో ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు.…

చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్చారు. మీడియా ముఖంగా దేశమంతా చూశారు. తనని ఎన్ని బూతులు తిట్టినా పడ్డానని, కానీ తన భార్యని అవమానించినందుకు తట్టుకోలేకపోతున్నానని ఏడ్చారు. ఆయన ఇలా ఏడవడం గతంలో ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు.

“చంద్రబాబు గుక్కపెట్టి ఏడవడం ఏంటి గురూ!”, అని కొందరు ఆశ్చర్యపోతున్నారు.

“చంద్రబాబుది దొంగ ఏడుపంతే” అని కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు.

ఆయనది దొంగ ఏడుపు అనడం మహాపాపం. అది అక్షరాలా నిజమైన బాధే. గుండెల్లోంచి కట్టలు తెంచుకుని వస్తున్న గూడుకట్టుకున్ని దుఃఖమే. ఆయన ఏ కారణం చేత ఏడుస్తున్నాని చెప్పినా ఇక్కడ అనేక కారణాలు పరిగణించుకోవాలి.

నిజానికి ఎన్.టి.ఆర్ పెంపకాన్ని శంకించే విధంగా చంద్రబాబు ధర్మపత్నిని టార్గెట్ చేస్తూ వల్లభనేని వంశీ కొన్ని వారాల క్రితం ఒక వ్యాఖ్య చేసారు. ఒకసారంటే పట్టించుకోలేదన్నట్టుగా వంశీ పదేపదే ఆ వ్యాఖ్య చేస్తూ వచ్చారు. నిజానికి చంద్రబాబు అప్పుడే ఏడ్చుండాలి. లేదా తెదేపా వర్గాలు వంశీపై దాడికి తెగబడుండాలి. కానీ అప్పుడంతా సైలెంటుగా ఉన్నారు.

సరిగ్గా కుప్పంలోని స్థానిక ఎన్నికల ఫలితాలు వెల్లడయిన రెండ్రోజులకి చంద్రబాబు ఏడ్చారు. అంటే ఆయన ఏడుపు భార్యను అవమానించినందుకు మాత్రమే కాదు కుప్పంపై తన పట్టు వీడిపోతూందన్న బాధ కూడా. దానికి తోడు తనని అవమానిస్తున్నవారిని మాటలతోటో, చేతలతోటో తిప్పికొట్టే సమర్ధుడైన వారసుడు కూడా లేకపోవడం మరొక భయంకరమైన కారణం.

తన వైపున ఉన్నాయనుకున్న శక్తులన్నీ నిర్వీర్యంగా కనిపించడం వల్ల గూడుకట్టుకున్న అన్ని బాధలు ఒకేసారి చుట్టుముట్టి ఆయనను గుక్కపెట్టేలా ఏడిపించాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులకు, అనుచరులకు, సానుభూతిపరులకు తప్ప మిగిలిన ఎవ్వరికీ పెద్దగా సానుభూతి కలగట్లేదు. దానికి కారణం సరిగ్గా ఇదే వయసులో ఎన్.టి.ఆర్ ఏడ్చిన ఏడుపు గుర్తు రావడం.

'తన' అనుకున్న అందరూ ఎన్.టి.ఆర్ ను వదిలేసి ఏ విధంగా మానసిక చిత్రవధ చేసారో చంద్రబాబుతో సహా చరిత్ర పుటలకి తెలుసు. ఆ వెన్నుపోటు సమయంలో ఎన్.టి.ఆర్ కు కొడుకులు, కూతుళ్లు తన వైపు లేరు. తాను పెంచి పోషించిన ఎమ్మెల్యేలు కూడా బాబుతో చేతులు కలిపారు. ఆ బాధతో ఆయన చంద్రబాబుని ఎన్నో తిట్లు తిడుతూ వీడియో కూడా విడుదల చేసారు. అప్పటి తన భార్య అయిన లక్ష్మీపార్వతి మానాన్ని శంకించేలా కూడా మాటలన్నారు. ఏకాకైపోయి చివరకి అదే మనస్థాపంతో ఎన్.టి.ఆర్ మరణించారు.

అప్పుడు సరిగ్గా ఏ వయసులో అయితే రామారావు ఏడ్చారో అదే వయసులో ఇప్పుడు ప్రకృతి  చంద్రబాబుని ఏడిపించింది.

తనవైపున ఉంటారనుకున్న కుప్పం ఓటర్లు బాబుని వెన్నుపోటు పొడుస్తున్నారు. తాను పెంచి పోషించిన ఎమ్మెల్యేలు వంశీ, నాని మొదలైన వారు తనకే ఎదురుతిరిగి అనరాని మాటలంటున్నారు. తన భార్య మానాన్ని శంకించే విధంగా మాట్లాడుతున్నారు.

అలా చేసిన కర్మలన్నీ కర్మపాశంలాగ చుట్టేస్తున్నాయి. ఆ కర్మసిద్ధాంతం కథని పక్కనబెడితే అసలు పబ్లిక్ గా ఏడ్చే నాయకుడి వెనుక ప్రజలుండరు.

జయలలితకి భయంకరమైన అవమానాలెదురయ్యాయి. ఆమె ఏకాంతంగా ఎంతైనా ఏడ్చుండొచ్చు. కానీ బహిరంగంగా ఒక శక్తిలా నిలబడింది.

జగన్ మోహన్ రెడ్డికి కలిగిన అవమానాలకి ఎన్నిసార్లైనా ఏడ్చుండాలి. కానీ పబ్లిక్ గా రాయిలా నిలబడ్డాడు.

షర్మిలకి ఒక సినీనటుడితో లింకు పెట్టి పచ్చతమ్ముళ్లు పైశాచిక ఆనందం పొందినప్పుడు ఆమె కూడా బహిరంగంగా ఏడ్చుండాలి. కానీ ఆమె ఎప్పుడూ బేలగా బావురుమనలేదు.

నాయకుల సంగతి పక్కనబెడితే మొన్నటికి మొన్న పోసాని కృష్ణమురళి తన భార్యని ఎవరో పవన్ ఫ్యాన్ అవమానించాడని ప్రెస్మీట్ పెట్టి ఉతికేసాడు తప్ప ఏడవలేదు.

“మా” ఎన్నికల్లో తనని మోహన్ బాబు బూతులు తిట్టాడని బెనర్జీ ఏడ్చాడు. అతనిపై సింపతీ రాలేదు.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఒక్కటే. అభిమానం విషయంలో బహిరంగంగా ఏడ్చే మగాడికి సింపతీ రాదు. ఏడుపు సహజమే అయినా దానిని నియంత్రించుకోవాల్సిన అవసరం పబ్లిక్ లైఫులో ఉన్నవాళ్లకి చాలా అవసరం.

“నేనైతే ఏడ్చేసే వాడిని. వీడు గట్టివాడు కాబట్టి నిలబడ్డాడురా..” అని ప్రజలు అనుకోవాలి. అటువంటి వాడికే వెనక జనం చెరతారు.

మాస్ సినిమాల్లో కూడా చూడండి. స్టార్స్ ఏడిస్తే జనం చూడలేరు. వాళ్లు తిరగబడాలనే ప్రేక్షకులు కోరుకుంటారు. కమల్ హాసన్ సినిమాల్లో ఎక్కువగా ఏడవడం వల్ల స్టార్ కాలేకపోయిండొచ్చు. నిజజీవితంలో స్టార్డం తెచ్చుకోవాలంటే మానసికంగా గట్టిపిండంలా కనపడాలి.

ఈ రోజు చంద్రబాబు ఏడుస్తూ కూడా తన గతవైభవం చెప్పుకున్నారు. బిల్ క్లింటన్, అబ్దుల్ కలాం అంటూ తన విజయాలు చెప్పుకున్నారు. ఇక తన భార్యకి జరిగిన అవమానాన్ని నిండు సభలో పాండవుల ముందే ద్రౌపదికి జరిగిన అవమానంతో పోల్చారు.

కౌరవసభలో ద్రౌపదికి అన్యాయం జరుగుతున్నప్పుడు దుశ్శాసనుడిని అడ్డుకోకుండా, దుర్యోధనుడు చేసేది తప్పని చెప్పకుండా మౌనంగా కూర్చున్న భీష్ముడు కూడా యుద్ధంలో దెబ్బతినాల్సి వచ్చింది. అన్యాయం జరుగుతున్నప్పుడు బంధం ఉండి కూడా మౌనంగా కూర్చున్న వాళ్లకి పట్టే గతి ఇదే అని మహాభారతం చెబుతోంది.

ఒక్కసారి 1995 ఆగస్టు సంక్షోభాన్ని కూడా కౌరవసభ అనుకుందాం. అప్పుడు ఎన్.టి.ఆర్ ద్రౌపది స్థానంలోనే ఉన్నారు. ఎన్.టి.ఆర్ కి చెప్పుల దాడితో బహిరంగంగా అంతటి అవమానం జరిగినా ఆయన సంతానం మౌనం వహించి చంద్రబాబు పక్షాన్నే ఉన్నారు తప్ప తండ్రి వైపు లేరు. కనీసం సానుభూతికూడా ప్రకటించలేదు. ఆ సంతానంలో చంద్రబాబు సతీమణికూడా ఒకరు. పైన భీష్ముడి గురించి చెప్పుకున్నట్టు ఒక విధంగా కర్మసిద్ధాంతం ఆమెకి కూడా అవమానం రూపంలో వర్తించి ఉండొచ్చు.

– శ్రీనివాసమూర్తి