చంద్రబాబు సూక్తులు వల్లిస్తుంటే జనం ఆశ్చర్యపోతూ ముక్కున వేలేసుకుని వింటున్నారు. మాట్లాడేది చంద్రబాబేనా, లేక కమ్యూనిస్టు యోధానుయోధులు తరిమల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు లాంటి నాయకులా అని విస్తుపోవడం జనం వంతైంది.
నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఇవాళ మహిళలతో ప్రజావేదిక కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించింది. ఈ సదస్సులో చంద్రబాబు ప్రసంగిస్తూ డబ్బు, భూమి కాదు… ప్రజలే తన ఆస్తి అని అన్నారు. ప్రజల ద్వారా సంపద సృష్టించి పేదలను ధనికులను చేసి చూపిస్తా అని ఆయన గొప్పలు చెప్పారు. సమాజంలో ధనికులు ఎక్కువ అవుతున్నారన్నారు. కానీ పేదల బతుకుల్లో మాత్రం మార్పు రాలేదని చంద్రబాబు వాపోయారు. అందుకే ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌ను అత్యధిక కాలం పరిపాలించిన ఘనత తనదే అని చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పారు. తన పాలనలో పేదలను ధనవంతులుగా చేసి వుంటే ఎవరు అడ్డుపడ్డారో ఆయనే సమాధానం చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆయన కంటికి పేదలు కనిపించరు.
గతంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ను చంద్రబాబు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఆ సందర్భంలో హైదరాబాద్‌లో భిక్షగాళ్లెవరూ కనిపించొద్దని పోలీసులతో బయటికి పంపారు. పేదరికాన్ని తరిమేయడం అంటే చంద్రబాబు దృష్టిలో వాళ్ల ఉనికి లేకుండా చేయడం అని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అంతే తప్ప పేదరికాన్ని తరిమి కొట్టేందుకు ఒక్కటంటే ఒక్క పథకమైనా చంద్రబాబు పాలనలో గుర్తించుకోదగ్గది అమలు చేయలేదనే విమర్శ వుంది. అధికారం లేకపోయే సరికి ప్రజలపై ఎనలేని ప్రేమాభిమానాలు ఒలకబోస్తున్నారు.
డబ్బు, భూమి కాదు.. తన ఆస్తి ప్రజలే అని చంద్రబాబు అనడం కంటే పెద్ద జోక్ మరొకటి వుండదని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. చంద్రబాబుకు అధికారానికి మించిన ఆస్తి ప్రపంచంలో మరేదీ వుండదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాని కోసం పిల్లనిచ్చిన మామను సైతం బలి పెట్టడానికి వెనుకాడలేదంటూ ప్రత్యర్థులు పాత సంగతులు గుర్తు చేయడం గమనార్హం.