జనసేనాని పవన్‌కల్యాణ్ ఎన్నికల ఖర్చు కోసం జనసేన వినూత్న కార్యక్రమం చేపట్టింది. వన్ డే ఫర్ జనసేన పేరుతో విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పటి వరకూ ఎంత మొత్తంలో విరాళం వచ్చిందో జనసేన ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది.
ఈ నెల 2న పవన్‌కల్యాణ్ పుట్టిన రోజును అభిమానులు ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్ అగ్రహీరోగా పవన్‌కు విశేష సంఖ్యలో అభిమానులు, అలాగే జనసేనానిగా ఆయనకు భారీ సంఖ్యలో కార్యకర్తల బలం వుంది. గతంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి పవన్ పదేపదే చెప్పేవారు. కానీ రాజకీయాల్లో డబ్బు లేనిదే ఏమీ చేయలేమనే వాస్తవం ఆయనకు త్వరగానే తెలిసొచ్చింది. దీంతో పార్టీ కోసం ఖర్చు పెట్టుకోక తప్పదని ఆయన బహిరంగంగానే ప్రకటించారు.
ఈ నేపథ్యంలో లీడర్ కోసం కార్యకర్తలు, నేతలు ముందుకొచ్చి నిధుల సేకరణ చేయాలని పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపారు. మన పార్టీ-మన బాధ్యత అంటూ జనసేనను అభిమానించే ఉద్యోగులు తమ ఒక్క రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో One day salary for janasena నినాదంతో ఉద్యమాన్ని నడిపారు.
2019లో పవన్ పుట్టిన రోజు పురస్కరించుకుని 33 వేల మంది విరాళాలు ఇచ్చారు. అప్పట్లో ఆ విరాళం గురించి పవన్ మాట్లాడాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. పవన్ కోసం అభిమానంతో విరాళాలు సేకరించడం తప్పేమీ కాదు. ఏ పార్టీ అయినా ఆ పని చేస్తుంది. అయితే పారదర్శకతకు పెద్దపీట వేస్తామని చెప్పే జనసేన నాయకులు… ఎంత మొత్తం విరాళంగా వచ్చిందో ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది. విరాళాన్ని బట్టి జనసేనకు ఎంత మేరకు ఆదరణ వుందో చెప్పొచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.