టెక్నికల్లీ… డౌట్స్ క్లియర్ ! కానీ…

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉంటుందా? లేదా? ఈ విషయంలో ఇప్పటికే ప్రజల మెదళ్లు బీభత్సంగా వేడెక్కిపోయి ఉన్నాయి. వందల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఈ పాయింట్ చుట్టూ అవునని, కాదని రకరకాల ప్రచారాలతో…

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉంటుందా? లేదా? ఈ విషయంలో ఇప్పటికే ప్రజల మెదళ్లు బీభత్సంగా వేడెక్కిపోయి ఉన్నాయి. వందల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఈ పాయింట్ చుట్టూ అవునని, కాదని రకరకాల ప్రచారాలతో హోరెత్తిపోతున్నాయి.

సాంకేతికంగా చూసినంత వరకు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే. ఇటీవల కేంద్ర సర్వే ఆఫ్ ఇండియా వారు విడుదల చేసిన మ్యాప్ పుణ్యమాని.. రేకెత్తిన సందేహాలను వారు.. తాజాగా నివృత్తి చేశారు. అమరావతిని.. ఏపీ రాజధానిగా చూపిస్తూ సరికొత్త మ్యాప్‌ను విడుదల చేశారు. టెక్నికల్‌గా డౌట్స్ క్లియర్ అయినట్లే.. కానీ..  ప్రజల్లో మాత్రం.. అమరావతి ఇక్కడే ఉంటుందా.. లేదా అనే సందేహాలు ఇంకా మిగిలే ఉన్నాయి.

రాజధాని అమరావతి విషయంలో అనేక సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. కొందరు మంత్రులు చెబుతున్నట్లుగా చంద్రబాబునాయుడు ప్రతిపాదించిన ప్రదేశంలో, ప్రతిపాదించిన రీతిలో రాజధానిని చేపట్టడానికి కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇటీవలి కాలంలో రాజధాని తరలిపోతున్నదనే పుకార్లు బాగా ప్రబలాయి.

అదే సమయంలో చంద్రబాబు రైతులనుంచి బలవంతంగా లాక్కున్న భూముల్లో మాయా పూరితమైన అభివృద్ధి చూపించడం కాకుండా.. ఆ ప్రాంతంలోనే ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న మరో ప్రదేశంలో న్యూ అమరావతి పేరుతో రాజధాని నగరాన్ని జగన్మోహనరెడ్డి ఆలోచిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఈలోగా.. కేంద్రం విడుదల చేసిన భారత దేశపు మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని సూచించకపోవడంతో.. పెద్ద గందరగోళమే రేగింది. గల్లా జయదేవ్ ఆ అంశాన్ని లోక్ సభలో కూడా ప్రస్తావించారు. హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించారు. సంబంధిత సర్వే ఆఫ్ ఇండియా అధికారుల్ని పిలిపించి.. సత్వరం ఆ తప్పు సరిచేయించి.. కొత్త మ్యాప్ ను విడుదల చేయించారు.

టెక్నికల్‌గా మ్యాప్ లోకి  రాజధాని గా అమరావతి వచ్చింది. దీనికి సంబంధించి జీవో కూడా విడుదలైంది గనుక.. అనుమానాలు అక్కర్లేదని కిషన్ రెడ్డి అన్నారు. కానీ.. దానిని జగన్ సర్కారు రాజధానిగానే పరిగణిస్తున్నదా? సొంత ఆలోచనతో సాగబోతున్నదా? అనేది చూడాలి.