మాజీ మంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన సీబీఐ నోటీసులపై స్పందించారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. తనకు సీబీఐ అధికారులు నిన్న నోటీసులు ఇచ్చారని.. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేదని.. ఐదు రోజులు తర్వాత ఎప్పుడు విచారణకు పిలిచిన హాజరవుతానని తెలిపారు.
అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల నుండి నాతో పాటు నా కుటుంబాన్ని ఓ వర్గం మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోందని … నేనేంటో నా వ్యవహార శైలి ఏంటో ఈ జిల్లా ప్రజలకు బాగా తెలుసని. న్యాయం గెలవాలని.. వాస్తవాలు తేలాలని తాను కూడా భగవంతుడిని కోరుకుంటున్నానన్నారు. ఆరోపణ చేసేవారు మరొకసారి ఆలోచించాలని.. ఇలాంటి ఆరోపణ చేస్తే మీ కుటుంబాలు ఎలా ఫీల్ అవుతాయో ఒకసారి ఉహించుకోమన్నారు.
కాగా వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులివ్వడం ఇదే తొలిసారి. దాదాపు రెండున్నరేళ్లుగా అవినాష్ ను ఒక్కసారీ కూడా ప్రశ్నించలేదు. సోమవారం పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఎంపీ పీఏ రాఘవరెడ్డికి నోటీసులు అందించారు.