ఎన్టీఆర్ వద్దు తమ్ముళ్లూ.. పవన్ మనకు ముద్దు

తెలుగుదేశం పార్టీకి వారసుడు ఎవరు? Advertisement బాబు మద్దతుదారులు లోకేష్ అంటారు. టీడీపీ వీరాభిమానులు ఎన్టీఆర్ అంటారు. మధ్యలో జై బాలయ్య అనే వాళ్లు కూడా ఉన్నారు. కానీ వీళ్లందర్నీ మరిచిపొండి. తెలుగుదేశం పార్టీ…

తెలుగుదేశం పార్టీకి వారసుడు ఎవరు?

బాబు మద్దతుదారులు లోకేష్ అంటారు. టీడీపీ వీరాభిమానులు ఎన్టీఆర్ అంటారు. మధ్యలో జై బాలయ్య అనే వాళ్లు కూడా ఉన్నారు. కానీ వీళ్లందర్నీ మరిచిపొండి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఆశాదీపం ఎవరో తెలుసా? ఇంకెవరు చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్.

జనసేన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీకి ఎలా అధ్యక్షుడు అవుతాడు? ఏం.. ఎందుకు కాకూడదు అని ప్రశ్నిస్తున్నారు టీడీపీలో మిగులు నాయకులు. ప్రజారాజ్యం అధ్యక్షుడైన చిరంజీవి, కాంగ్రెస్ హయాంలో మంత్రి అవ్వలేదా.. ఇది కూడా అలానే అవుతుందంటూ జోస్యం చెబుతున్నారు.

ఈ ఊహాగానాలకు మరింత బలమిచ్చేలా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. పవన్ ను గుడ్డిగా ఫాలో అయిపోండి తమ్ముళ్లు అంటూ పిలుపునిస్తున్నారు. పవన్ ఎలాంటి కార్యక్రమం చేపట్టినా, ఏ ఉద్యమానికి పిలుపునిచ్చినా పూర్తిగా అతడికి అండదండలు అందించాలని శ్రేణులకు నిర్దేశిస్తున్నారు. పైకి పవన్ ను బాబు బాగా వాడేస్తున్నాడని అనిపించినప్పటికీ.. అంతర్గతంగా మాత్రం చంద్రబాబు పవన్ ను టీడీపీ భవిష్యత్ ఆశాదీపంగా చూస్తున్నారట.

అటు జనసేనాని వ్యవహారశైలి కూడా అలానే ఉంది. తన సొంత పార్టీని క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధి చేయాల్సింది పోయి.. టీడీపీ ఎజెండా ఆధారంగా రోజులు గడిపేస్తున్నారు. ఇప్పటికీ పార్టీకి జిల్లా స్థాయిలో సరైన క్యాడర్ లేదు. ఇక గ్రామ, మండల స్థాయిల్లో క్యాడర్ సంగతి సరే సరి. పార్టీ పెట్టి ఐదేళ్లైనా పవన్ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదు. తన ఫ్యాన్స్ ను చూసి వాపును బలుపు అని భ్రమ పడతున్నారు.

జనసేన పార్టీ పెట్టి ఐదేళ్లు దాటింది. మరో పార్టీ అయితే ఈపాటికి గ్రామ స్థాయి నుంచి విస్తరించేది. జిల్లాకో నాయకుడ్ని సిద్ధం చేసేది. కానీ జనసేనలో మాత్రం ఇప్పటికీ ఏకో నారాయణ. ఎటు చూసినా పవన్.  ద్వితీయ శ్రేణిలో పట్టుమని పది మంది లేరు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, పవన్ తన పార్టీపై దృష్టి పెడితే వచ్చే ఎన్నికల నాటికి సర్వసన్నద్ధం కావొచ్చు.

కానీ, పవన్ కు ఈ ఆలోచనలు అస్సలు తట్టడం లేదు. కనీసం చుట్టుపక్కలున్న జనాలు కూడా జనసేనానికి ఈ విషయం చెప్పడం లేదు. ప్రస్తుతం పవన్ పార్టీని పూర్తిగా వదిలేశారు. బాబు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. తెలుగుతమ్ముళ్ల జేజేల మధ్య జీవితం గడిపేస్తున్నారు. కొన్నాళ్ల పాటు ఇలానే కొనసాగితే.. జనసేన మరుగున పడిపోయి.. చంద్రబాబు తర్వాత పవన్ కల్యాణే టీడీపీకి దిక్కు అన్నట్టు తయారవుతుంది పరిస్థితి. 

బహుశా.. బాబు కోరుకుంటోంది కూడా ఇదేనేమో. ఎందుకంటే.. ఎన్టీఆర్ రాకుండా అడ్డుకోవాలంటే చంద్రబాబుకు పవన్ తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు. పైగా ప్రస్తుతం అందరూ ఎన్టీఆర్ పేరు జపిస్తున్నారు. ఆ పేరును అణచివేయాలంటే పవన్ ను పైకి తీసుకురావాల్సిందే. ప్రస్తుతం బాబు చేస్తోంది అదే.