తమిళ హీరో విష్ణు విశాల్, బ్యాడ్మింటర్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప్రేమించుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే. తమ ప్రేమ విషయాన్ని ఆమధ్య గుత్తా జ్వాల స్వయంగా బయటపెట్టింది కూడా. ఇప్పుడీ జంట తమ ప్రేమను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. అవును.. వీళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ పూర్తయింది.
ఈరోజు గుత్తా జ్వాల తన 37వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటోంది. సరిగ్గా రాత్రి 12 గంటలకు విష్ణు విశాల్ ఆమెను విష్ చేశాడు. తనదైన స్టయిల్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పాడు. అయితే ఎందుకో అదే టైమ్ లో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకోవాలని అనిపించిందట వీళ్లకు. వెంటనే అర్థరాత్రి వేళలో ఓ ఉంగరం తెప్పించి మరీ ఆమె వేలికి తొడిగాడు విష్ణువిశాల్.
అలా వీళ్లిద్దరి నిశ్చితార్థం పూర్తయింది. ఈ విషయాన్ని విష్ణు విశాల్ పరోక్షంగా వెల్లడించాడు. అర్థరాత్రి టైమ్ లో తమ కోసం ఉంగరం తీసుకొచ్చిన బసంత్ జైన్ (గుత్తా జ్వాల మేనేజర్)కు థ్యాంక్స్ చెప్పాడు.
దాదాపు 15 ఏళ్ల కిందట గుత్తా జ్వాల, చేతన్ ఆనంద్ పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లయిన ఆరేళ్లకు విడిపోయారు. అటు విష్ణు విశాల్ కూడా కాస్ట్యూమ్ డిజైనర్ రజనీని పెళ్లి చేసుకున్నాడు. 2018లో విడాకులు తీసుకున్నాడు.