ఏపీలో 2068 గ్రామాలకు మొబైల్ ఫోన్ సేవలు లేవు

ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పు కనుమలలో దాదాపు 2,068 గ్రామాలకు మొబైల్‌ ఫోన్‌ సర్వీసులు అందుబాటులో లేవని కమ్యూనికేషన్ల మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన…

ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పు కనుమలలో దాదాపు 2,068 గ్రామాలకు మొబైల్‌ ఫోన్‌ సర్వీసులు అందుబాటులో లేవని కమ్యూనికేషన్ల మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ, రాష్ట్రంలో తూర్పు కనుమలు విస్తరించి ఉన్న 9 జిల్లాల్లో ఈ గ్రామాలు ఉన్నట్లు చెప్పారు. 

ఈ గ్రామాలు తూర్పు కనుమలలో మారుమూల ప్రాంతాలలో అనువుకాని భౌగోళిక ప్రాంతంలో అక్కడక్కడ విసిరేసినట్లు ఉండి వాణిజ్యపరమైన కార్యకలాపాలకు అనువుగా లేని కారణంగానే మొబైల్‌ ఫోన్‌ సర్వీసులను ఆయా గ్రామాలకు విస్తరించలేకపోయినట్లు మంత్రి చెప్పారు. వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా టెలికామ్‌ సర్వీసు ప్రొవైడర్లతో కలిసి ఆయా గ్రామాలకు మొబైల్‌ ఫోన్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 

అందుకు అనుగుణంగా 346 మొబైల్‌ టవర్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తూర్పు కనుమలు విస్తరించి ఉన్న 9 జిల్లాల్లో 8963 గ్రామాలు ఉండగా అందులో 5,967 గ్రామాలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ ఫోన్‌ సర్వీసులను అందిస్తోంది. తగినన్ని నిధులు సాంకేతికంగా, వాణిజ్యపరంగా అనుకూలమైన పరిస్థితి ఏర్పడినపుడు మిగిలిన గ్రామాలకు కూడా మొబైల్‌ ఫోన్‌ సర్వీసులను విస్తరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. 

విద్యా సంస్థల్లో 25 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాల్సిందే

విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రతి విద్యా సంస్థలో బలహీన వర్గాల విద్యార్దుల కోసం 25 శాతం రిజర్వేషన్‌ కచ్చితంగా అమలు చేసి తీరాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియల్‌ నిషాంక్‌ రాజ్యసభలో స్పష్టం చేశారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ, విద్యా సంస్థలపై పాలనా నియంత్రణ రాష్ట్రాల చేతుల్లో ఉందని చెబుతూ, 6-14 ఏళ్ళ లోపు బాలబాలికలకు ప్రాధమిక విద్యను హక్కుగా మారుస్తూ 2009లో ఆర్టీఈ చట్టం వచ్చిందని అన్నారు. 

ఆర్టీఏ చట్టం అన్ని ప్రైవేట్‌ ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ సూళ్ళకు కూడా వర్తిస్తుందని అన్నారు. దీని ప్రకారం ప్రతి విద్యా సంస్థ బలహీన వర్గాల పిల్లకు విధిగా అడ్మిషన్‌ కల్పించాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ స్కూళ్ళలో ఆర్టీఏ చట్టం అమలు జరుతున్న తీరుపై మదింపు చేయవలసిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను 2016లోనే తమ మంత్రిత్వ శాఖ కోరినట్లు చెప్పారు.