పవన్ డేట్స్ తెలీకుండా ప్రతిజ్ఞ చేస్తున్న నాగబాబు!

అనునిత్యం జిమ్ ట్రైనింగ్ తో, పర్ఫెక్ట్ ఫిట్ నెస్ తో ఉండే రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్. అంతగా జిమ్ కసరత్తులు చేయడం అనేది సినిమా హీరోగా తన కెరీర్ ను కాపాడుకోవడానికే కావొచ్చు…

అనునిత్యం జిమ్ ట్రైనింగ్ తో, పర్ఫెక్ట్ ఫిట్ నెస్ తో ఉండే రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్. అంతగా జిమ్ కసరత్తులు చేయడం అనేది సినిమా హీరోగా తన కెరీర్ ను కాపాడుకోవడానికే కావొచ్చు గాక.. కానీ ఫిట్నెస్ అన్నది నిజం. అలాంటి పవన్ కల్యాణ్.. సెంటిమెంట్లను కూడా చాలా బలంగానమ్మే పవన్ కల్యాణ్, అధికారంలోకి రావడానికి పాదయాత్రలు ఈ రాష్ట్రంలో ఒక సెంటిమెంటు దారిలాగా స్థిరపడ్డాయని తెలిసి కూడా వాహనం ఎక్కి వారాహి యాత్ర చేయాలని మాత్రమే ఎందుకు అనుకున్నారు? ఇందుకు సమాధానం చాలా  సింపుల్. 

పవన్ కల్యాణ్ షూటింగుల్లో బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికల సంవత్సరంలో కూడా చేయవలసిన సినిమాలు ఉన్నాయి. పూర్తి సమయం ప్రజలకు కేటాయించేంత ఖాళీగా ఆయన లేరు. కాల్షీట్లు లేవు. అందుకే షూటింగ్ మధ్య గ్యాప్ లలో ప్రజలను కలుస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తాను కూడా తిరిగినట్లుగా మమ అనిపించడానికి బస్సుయాత్ర అని పేరు పెట్టుకున్నారు. సినిమా వ్యక్తి గనుక.. ఏ చిన్న పని చేయదలచుకున్నా.. కాస్త భారీ ఖర్చుతో దానికి హైప్ క్రియేట్ చేయడం అనే టెక్నిక్ కు అలవాటు పడిన వ్యక్తి గనుక.. తాను తిరిగే దూరాలకు ఆ బస్సును చాలా ప్రత్యేకంగా, వివాదాస్పదంగా తయారుచేయించుకున్నారు. వారాహి అని పేరు పెట్టుకున్నారు. వారాహి యాత్ర వెనుక ఇంత పెద్ద కథ ఉంది. 

అలాంటిది ఇప్పుడు నాగబాబు హఠాత్తుగా తెరమీదికి వచ్చి.. తాను ప్రజలతో కలుస్తూ.. ‘పవన్ కల్యాణ్ వారాహి యాత్రను ప్రభుత్వం అనుమతించకపోతే.. ఆయన పాదయాత్ర చేస్తారు’ అంటూ కొత్తగా బెదిరిస్తే ఎలా? రాష్ట్రంలో రాజకీయం ఎలా అయిపోయిందంటే.. ‘పాదయాత్ర’ అనేది ప్రభుత్వం పట్ల ఒక బెదిరింపు అస్త్రంలాగా అయిపోయింది. 

అంటే బహుశా ఆయన దృష్టిలో.. తన తమ్ముడు పవన్ కల్యణ్ పెద్ద హీరో గనుక.. ఆయన రోడ్డుమీదకు వచ్చి పాదయాత్ర చేస్తే ఆయా ఊర్లలోని జనం మొత్తం రోడ్ల మీదనే ఉంటారు. ఆ జనాన్ని కంట్రోల్ చేయడం మీకు చేతకాదు. మీమీద సానుభూతితో మాత్రమే ఆయన బస్సుయాత్ర చేయాలనుకుంటున్నారు. ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నట్లుగా ఉంది. అయినా పవన్ కల్యాణ్ దగ్గర పాపం డేట్స్ ఉన్నాయో లేదో.. ప్రజలకోసం కేటాయించడానికి ఆయన వద్ద కాల్షీట్లు ఎన్ని ఉన్నాయో తెలియకుండానే.. ఆయన మేనేజర్ లాంటి నాగబాబు.. ఇలా పాదయాత్ర ప్రకటించేస్తే ఎలా అనేది ప్రజలకు కలుగుతున్న ఒక సందేహం.

అదేసమయంలో.. సొంత పుత్రుడు నారా లోకేష్ పాదయాత్ర చేస్తుండగా, దత్తపుత్రుడు కూడా బస్సులో కాకుండా పాదయాత్ర చేస్తే.. ఎవరిది ఎక్కువ సక్సెస్ అయిందనే కంపేరిజన్ వస్తుందని పాపం నారా చంద్రబాబునాయుడు అసూయ పడకుండా ఉంటారా? అనేది కూడా ప్రజలకు కలుగుతున్న రెండో ప్రశ్న. ఈ ప్రశ్నల గురించి.. ప్రభుత్వాన్ని పాదయాత్ర పేరుతో బెదిరిస్తున్న నాగబాబు ఆలోచించారో లేదో మరి.