రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియాన్ని అడ్డుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్న వారిలో ఏ-1 గా చంద్రబాబు ఉండాల్సింది. కానీ మహా తెలివిగా బాబు తప్పుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియాన్ని అడ్డుకుని ఏపీ ప్రజల దృష్టిలో మెయిన్ విలన్ గా మారిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్. అసలు పవన్ కల్యాణ్ ఈ మీడియం వ్యవహారంలో ఇంత ఇదిగా రెచ్చిపోవాల్సింది కాదు. వాస్తవ పరిస్థితుల్ని అధ్యయనం చేసి, అవగాహన హెంచుకుంటే జగన్ చేస్తున్నదేంటి, దానివల్ల కలిగే లాభాలేంటనేది పవన్ కి అర్థమై ఉండేది.
తెలుగు ఓ సబ్జెక్ట్ గా ఉంటూనే, మీడియాన్ని ఇంగ్లిష్ లోకి మార్చాలనేది జగన్ ప్రయత్నం. కానీ పవన్ మాత్రం తెలుగుని చంపేస్తున్నారు, తెలుగు భాషే లేకుండా చేస్తున్నారంటూ వితండవాదం చేస్తున్నారు. చంద్రబాబు ట్రాప్ లో పడిపోయి పూర్తిగా ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకించారు. తెలుగుకి అనుకూలంగా మాట్లాడుతుండే సరికి గతంలో పవన్ ని పట్టించుకోని మీడియా కూడా ఇప్పుడు ప్రముఖంగా ఆయన వార్తల్ని కవర్ చేస్తోంది. దీంతో మరింతగా ఉబ్బిపోయి, తబ్బిబ్బైపోయి పవన్ కల్యాణ్ ఆవేశానికి లోనయ్యారు. ఆ పేపర్ కటింగ్ లను చూపిస్తూ పోస్టింగ్ లు పెడుతూ వచ్చారు.
పవన్ కల్యాణ్, లేదా ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్న ఇంకెవరైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీడియం ఏదైనా లెక్కల్లో ఉండే ఎ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రాన్ని ఇంగ్లిష్ లోనే చదవాల్సి ఉంటుంది. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లను తెలుగులో అనువదిస్తానంటే కుదరదు, యాసిడ్ ని అచ్చ తెలుగులో ఆమ్లము అనే అంటామంటే మడికట్టుకు అదే క్లాస్ లో కూర్చోవాల్సి వస్తుంది.
పై చదువులకు వెళ్లే కొద్దీ ఇంగ్లిష్ పదాలు, ఇంగ్లిష్ మీడియం అనేది కచ్చితంగా అవసరం. కంప్యూటర్ చదువులొచ్చాక ఉపాధి కోసం ఇంగ్లిష్ తప్పనిసరి అయింది. అదేదో చిన్న వయసులోనే నేర్చుకుంటే.. ఆ తర్వాత చదువుల్లో రాణించడం మరింత సులువు అవుతుంది. అంత మాత్రాన తెలుగు సంధులు, సమాసాలు, వ్యాకరణం ఎక్కడికీ పోదు. తెలుగు భాషను కించపరిచినట్టు కూడా కాదు. తెలుగు అనే సబ్జెక్ట్ అలాగే ఉంటుంది. తెలుగు ఇష్టపడేవాళ్లు, తెలుగు భాషను అభిమానించేవాళ్లు.. తెలుగులో డాక్టరేట్ వరకు వెళ్లొచ్చు, దీనికొచ్చిన ఇబ్బందిలేదు, దీన్నెవరూ తీసేయనూ లేదు.
ఈ విషయాలు పవన్ కి చెప్పేవారు ఎవరూ లేక కాదు, కానీ తానుపట్టిన కుందేటికి మూడే కాళ్లు అనుకునే రకం, అత్యంత ఇగోతో రగిలిపోయే వ్యక్తి పవన్ కల్యాణ్. అందుకే గుడ్డెద్దు చేలోపడ్డట్టు జగన్ ని విమర్శిస్తూ పోతున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు తెలివిగా పక్కకు తప్పుకున్నారు. పేద ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండే సరికి మెల్లమెల్లగా సైలెంట్ అయ్యారు. ఇంగ్లిష్ మీడియం వద్దనలేదు, తెలుగు మీడియం కూడా కొనసాగిస్తే బాగుండేది కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఇంగ్లిష్ మీడియంపై జరుగుతున్న రాద్ధాంతాన్ని తెలివిగా పవన్ పైకి నెట్టేసి, తాను మాత్రం టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, తిరుపతి వెంకన్నను దూషిస్తున్నారంటూ ఊరూవాడా తిరుగుతున్నారు. పవన్ ఈ సోలో సబ్జెక్ట్ నే నెత్తికెత్తుకుని తిరుగుతున్నారు. త్వరలోనే మన నుడి-మన నది అంటూ ఏదో కార్యక్రమం చేపట్టడానికి కూడా రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి పొద్దున్నుంచి వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.
పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. ఇంగ్లిష్ మీడియంకు సంబంధించి ఏపీ సర్కారు నిన్ననే జీవో జారీ చేసింది. అందులో విధివిధానాలన్నీ స్పష్టంగా ఉన్నాయి. అయినా కూడా పవన్ తన చేతిలో ఉన్న కుందేలును వదల్లేదు. బుర్రలో ఉన్న భ్రమల్ని కూడా వదల్లేదు. పేద ప్రజల దృష్టిలో ఇంగ్లిష్ మీడియం చదువులు అడ్డుకుంటున్న విలన్ లా మారారు. ఇక్కడ తప్పించుకుంది చంద్రబాబు, ఇరుక్కుంది పవన్ కల్యాణ్.