టార్గెట్ లోకేష్.. ఇంటాబయటా ఒకటే గోల!

ముద్దపప్పు, శుద్ద పప్పు.. ఇలా అంటారే తప్ప ఇంతకు మించి లోకేష్ ని ఎవరూ విమర్శించరు, ఎవరూ పెద్దగా పట్టించుకోరు, ఆటలో అరటిపండులా ట్రీట్ చేస్తారంతే. ఇలాంటి ఇమేజ్ తో తండ్రి చాటు బిడ్డలా…

ముద్దపప్పు, శుద్ద పప్పు.. ఇలా అంటారే తప్ప ఇంతకు మించి లోకేష్ ని ఎవరూ విమర్శించరు, ఎవరూ పెద్దగా పట్టించుకోరు, ఆటలో అరటిపండులా ట్రీట్ చేస్తారంతే. ఇలాంటి ఇమేజ్ తో తండ్రి చాటు బిడ్డలా పార్టీ పగ్గాలు అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు లోకేష్. కానీ ఇప్పుడు లోకేష్ కి పెద్ద కష్టమొచ్చి పడింది.

సొంత పార్టీలో ఆయన శక్తి సామర్థ్యాలపై నమ్మకం లేని అసమ్మతి సరే సరి, పొరుగు పార్టీల వాళ్లు కూడా పదే పదే లోకేష్ సామర్థ్యాన్ని శంకిస్తుండడం అటు చంద్రబాబుకి, ఇటు చినబాబుకి ఇద్దరికీ సమస్యగా మారింది. లోకేష్ ని భావి టీడీపీ అధినేతగా ప్రొజెక్ట్ చేసేందుకు ఐదున్నరేళ్లుగా చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నా అవేవీ ఫలితాన్నివ్వలేదు. కొత్తగా లోకేష్ అసలా పదవికి పనికి రాడంటూ వినిపిస్తున్న వ్యాఖ్యలు టీడీపీలోనే గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.

వాస్తవానికి వైసీపీవాళ్లకు టీడీపీ అంతర్గత వ్యవహారాలతో పనిలేదు, కానీ మంత్రి కొడాలి నాని ఆమధ్య ప్రెస్ మీట్లో లోకేష్ రోడ్డు రోలర్ గా మారి సొంత పార్టీనే తొక్కేస్తున్నారని, నలిపేస్తున్నారనీ సెటైర్లు వేశారు. ఇటీవల టీడీపీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీ కూడా లోకేష్ ని టార్గెట్ చేశారు. ముద్దపప్పులో ఫైర్ లేదని, ఎన్టీఆర్, బాలయ్యలో ఆ ఫైర్ ఉందని, లోకేష్ కి ఆ పార్టీ అప్పగిస్తే ఇక అంతే సంగతులంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ నుంచి బైటకి వెళ్తున్న వంశీకి, ఇక ఆ పార్టీ ఎలాగున్నా ఏ నష్టం లేదు, కానీ వెళ్తూ వెళ్తూ లోకేష్ పై పెద్ద బండపడేసి, మిగులు జనాల్ని కూడా ఆలోచనలో పడేసి వెళ్లిపోయారు వంశీ.

టీడీపీలో ఉన్న సీనియర్లకి కూడా లోకేష్ పై నమ్మకం లేదు కానీ ఎలాగోలా సర్దుకుపోతున్నారు.  ఇప్పుడిలా లోకేష్ సామర్థ్యాన్ని అందరూ శంకిస్తూ విమర్శలు చేస్తుండేసరికి టీడీపీ వీర విధేయుల్లో కూడా తిరుగుబాటు స్వరం వినిపిస్తోంది. ఇక వీటన్నింటికీ పరాకాష్ట రామ్ గోపాల్ వర్మ తీస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా. చంద్రబాబు కపటత్వాన్నీ, జగన్ ఆవేశాన్నీ, పవన్ ప్రగల్భాలనూ ప్రముఖంగా చూపిస్తున్న వర్మ, లోకేష్ ని మాత్రం అసమర్థుడిలా ప్రజెంట్ చేస్తున్నారు.

రాను రాను లోకేష్ అంటేనే ఓ కమెడియన్, ఓ మొద్దబ్బాయి, మాటలు రాని నత్తి అబ్బాయి అనే అభిప్రాయం రాష్ట్రంలో ప్రబలుతోంది. ఎన్ని జాకీలు పెట్టి లేపినా లోకేష్ అనే జీవి పైకి ఎదగలేడు అనే విషయం స్పష్టమవుతుంది. ఇక టీడీపీవారంతా 'ఎవరో రావాలి'.. అని బృందగానం చేయాల్సిందే.